నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులకు మధ్య ఉపాధి నిధుల పంచాయితీ నడుస్తోంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద సర్కార్ మంజూరు చేస్తున్న నిధుల్లోనూ ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వడంపై జడ్పీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్‌లకు అసలే నిధులు రాకపోగా.. వచ్చిన ఉపాధి నిధుల్లోనూ తమకు వాటా ఇవ్వకపోడంపై సభ్యులు మండిపడుతున్నారు. జడ్పీలో తీర్మానం చేస్తే తప్ప ఉపాధి హామీ నిధులు రిలీజ్ చేసే అవకాశం లేదు. దీంతో నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యులు తీర్మానాన్ని బహిష్కరించి ధిక్కారాన్ని ప్రకటించారు.
నిధులన్నీ వాళ్లకే..
ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు ఉపాధి పథకం నుంచి కోట్ల ఫండ్స్ ఇస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ పలుకుబడిని ఉపయోగించి సీఎం, మంత్రి కోటా నుంచి కూడా నిధులు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో ఒక్కో ఎమ్మెల్యే రూ.10కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఫండ్స్ శాంక్షన్ చేయించుకున్నారు. అందులో ఈ యేడాది ఇప్పటి వరకు నయా పైసా కూడా జడ్పీటీసీ సభ్యులకు ఇవ్వలేదు. ఉపాధి హామీకి సంబంధించిన నిధుల్లోనైనా తమకు వాటా ఇవ్వాలని కొన్నాళ్లుగా అంటున్నారు. నిధులివ్వకపోయినా కనీసం పనులను సిఫార్సు చేసే టైంలోనైనా తమను సంప్రదించాలని, దానివల్ల కొంతవరకైనా గౌరవం దక్కుతుందని వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తమ సహకారం తీసుకునే ఎమ్మెల్యేలు.. నిధుల్లో వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు.
మినరల్ ఫండ్స్‌లోనూ అదే తీరు...
జిల్లా మినరల్ ఫండ్స్‌ను కూడా ఎమ్మెల్యేలు చిత్తం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నారని, అందులోనూ తమకు వాటా లేకుండా చేస్తున్నారని సభ్యులు మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచే ఎక్కువగా మినరల్ ఫండ్వస్తోంది. ఏ నియోజకవర్గాల నుంచి మినరల్ ఫండ్ వస్తుందో ఆ ప్రాంతాలకే మొదటి ప్రియారిటీ ఇవ్వాలి. కానీ ఫండ్స్ రాని ఏరియాలకు చెందిన ఎమ్మెల్యేలే ఆ నిధులను కూడా ఎగేసుకుపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ అసలు పంచాయితీ...
నల్గొండ జిల్లాకు 2022-–23కు గాను ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రూ.18 కోట్లు మంజూరు చేసింది. ఉపాధి హామీ చట్టం ప్రకారం జడ్పీ జనరల్ బాడీ మీటింగ్‌లో తీర్మానం ఆమోదిస్తేనే ఫండ్స్ రిలీజ్ అవుతాయి. తమకూ ఈ నిధుల్లో వాటా కావాలని జడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తాము గెలిచి, నాలుగేండ్లయినా ఒక్కొక్కరికి రూ.20 లక్షలకు మించి నిధులు రాలేదని, 15వ ఆర్థిక సంఘం నిధులు 9 నెలల నుంచి రావడం లేదని వారు అంటున్నారు. ప్రభుత్వం జడ్పీలకు రావాల్సిన సెస్ ఇవ్వడం లేదని, జనరల్ ఫండ్ ఖజానా ఖాళీగా ఉందని వాపోతున్నారు. గతంలో ఉపాధి నిధుల్లో సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు వాటా ఉండేది. లోకల్బాడీల్లో తీర్మానాలు ఆమోదించి పంపితేనే ఫండ్స్ వచ్చేవి. కానీ ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ ఎమ్మెల్యేలకు ప్రియారిటీ ఇస్తోంది. వాళ్ల సిఫార్సు మేరకే ఉపాధి హామీ నిధులు ఇస్తున్నారు. డైరక్ట్ గా మంత్రి నుంచే ఎమ్మెల్యేలు ప్రొసీడింగ్స్ తెచ్చుకుంటున్నారు. ఆ పనులనే ఆమోదిస్తూ జడ్పీలో తీర్మానాన్ని పాస్ చేయాలని సర్కార్ ఆర్డర్స్ జారీ చేస్తోంది. సర్కారు తీరుపై నల్గొండలో జడ్పీ సభ్యులు తిరుగుబాటు చేశారు. గత వారం జరిగిన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్‌లో ఉపాధి నిధులపై చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులంతా దాన్ని ఆమోదించకుండా బహిష్కరించారు.