విద్యార్థులు వర్సెస్ పోలీసులు.. సోషల్​ మీడియాలో ఇరువర్గాల నడుమ వార్

కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్ డీ అడ్మిషన్లలో అక్రమాల ఆరోపణలు చిలికిచిలికి గాలివానలా మారాయి. పీహెచ్​డీ కేటగిరి-1, కేటగిరి-2 అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడి, అర్హులైన విద్యార్థులకు అధికారులు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని కొద్ది రోజులుగా స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. అక్రమాలపై విచారణ జరపాలని ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈనెల 5న కేయూ ప్రిన్సిపల్​ ఆఫీస్​ లోపల ఏబీవీపీ, బీసీ విద్యార్థి సంఘం, ఇతర యూనియన్ల నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టగా.. పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడం, ఆ తరువాత టాస్క్​ఫోర్స్​ పోలీసులు తమను విపరీతంగా కొట్టారని విద్యార్థులు జడ్జి ఎదుట ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులపై దాడిచేసి, రిమాండ్ కు పంపారన్న విషయం వర్సిటీలో చిచ్చురేపగా.. అప్పటి నుంచి వరంగల్​ పోలీసులు, కేయూ స్టూడెంట్ల మధ్య సోషల్​ మీడియా వేదిక వార్​ నడుస్తోంది.

ఒకరిపై ఒకరు పోస్టులు

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులపై వరంగల్ పోలీసులు కర్కశంగా వ్యవహరించారని, వారిని సీపీ రంగనాథ్​ చంపేస్తానని బెదిరించారంటూ ఎంజీఎం డాక్టర్లు కట్టిన కట్లతో ఉన్న విద్యార్థి సంఘాల నేతల ఫొటోలతో స్టూడెంట్లు సోషల్​ మీడియాలో పోస్టు పెట్టారు. పీహెచ్​డీ అడ్మిషన్లలో అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీసులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారని ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఆ పోస్టు వైరల్​ కావడంతో వరంగల్ సీపీ రంగనాథ్​ స్పందించారు. ఈనెల 7న కేయూ వీసీ తాటికొండ రమేశ్, ఎంజీఎం డాక్టర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారని, విద్యార్థులు పాత గాయాలు చూపి, ఎంజీఎం డాక్టర్లను దాదాపు వంద మంది  చుట్టుముట్టి కట్లు కట్టించుకున్నారని సీపీ చెప్పారు.

 తాను గన్ తో ఎవరినీ బెదిరించలేదని పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఆ తరువాత పోలీసులు కేయూ ప్రిన్సిపల్ ఆఫీసు​ సీసీ ఫుటేజీ సేకరించి ‘విద్యార్థుల ముసుగులో విధ్వంసం’ అంటూ శనివారం సోషల్​ మీడియాలో పోస్టు పెట్టారు. ‘విద్వేషం, విధ్వంసం ప్రతిచర్యకు దారి తీస్తుంది’ అని అందులో రాశారు. ఇప్పటికే పీహెచ్​డీ అడ్మిషన్లలో అక్రమాలు, పేద విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా స్టూడెంట్లను క్రిమినల్స్​ గా చిత్రీకరిస్తున్నారని విద్యార్థి సంఘాలతో పాటు వివిధ పార్టీల నేతలు మండిపడుతుండగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో పోలీసులు పెట్టిన పోస్టు వైరల్​ గా మారింది.