తిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత..

నామినేషన్ల దాఖలుకు చివరి రోజున తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య వార్ జరిగింది. చంద్రగిరి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ దాఖలు చేసేందుకు రావటంతో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారును అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పలువురు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చంద్రగిరి అసెంబ్లీ బరిలో వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తుండగా కూటమి తరఫున పూలవర్తి నాని పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసిన ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో ఇరు పక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది.