వ్యవసాయ​ మార్కెట్లో స్తంభించిన కొనుగోళ్లు.. మళ్లీ మొండికేశారు

జనగామ, వెలుగు: ఆఫీసర్లకు ట్రేడర్లకు మధ్య ఇంకా వార్​ కొనసాగుతూనే ఉండడంతో జనగామ అగ్రికల్చర్​మార్కెట్​కు 'మద్దతు' గ్రహణం వీడడం లేదు. సర్కారు ఆదేశాల మేరకు రైతులకు కనీస మద్దతు ధర ఇస్తేనే మార్కెట్​లో కొనుగోళ్లకు అవకాశం ఇస్తామని ఆఫీసర్లు మరోసారి తేల్చిచెప్పారు. దీంతో ఇన్నాళ్లుగా బంద్​ఉన్న మార్కెట్​ కనీసం సోమవారం నుంచైనా మొదలవుతుందని అంతా భావించినా ఆ ఛాన్స్​ కూడా లేకుండా పోయింది.  

పట్టు వీడని ఆఫీసర్లు 

వరి ధాన్యానికి క్వింటాల్​కు ఏ గ్రేడ్​కు రూ 2203, కామన్​రకానికి రూ.2183 మద్దతు ధరను సర్కారు ఇస్తోంది. ఈ ధరను ప్రైవేటు వ్యక్తులు కూడా ఇవ్వాలని ఇటీవల ఇక్కడ ఆందోళన చేసిన నేపథ్యంలో స్వయంగా సీఎం రేవంత్​రెడ్డి ట్వీట్​చేశారు. ఆరోజు నుంచి మద్దతు ధర ఇప్పించేందుకు ఆఫీసర్లు ఉడుం పట్టు పట్టారు. కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్​, అడిషనల్​ కలెక్టర్ రోహిత్​సింగ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ట్రేడర్లు మాత్రం నాణ్యత ఆధారంగానే కొంటామని, మద్దతు ధరను ఇవ్వలేమంటున్నారు. అలాగైతే కొనుగోళ్లకు చాన్స్​ఇచ్చేది లేదని అధికారులు నిర్మోహమాటంగా చెప్తున్నారు. మరో అడుగు ముందుకేసి రైతులు ఇబ్బంది పడకుండా అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్​యార్డుకు ధాన్యం తీసుకురావద్దని కోరుతున్నారు. గ్రామాల్లోని సర్కారు కొనుగోలు సెంటర్లలోనే అమ్ముకోవాలని సూచిస్తున్నారు.

యార్డులో కొన్నది ఒక్కరోజే  

ట్రేడర్లు ఒక్కటై తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారనే ఆరోపణలతో 12 రోజుల క్రితం జనగామ మార్కెట్​లో మొదలైన ఇక్కట్లు నేటికీ కొలిక్కి రావడం లేదు. ఈనెల10 వ తేదీన మద్దతు ధర ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళన చేయడంతో11న ముగ్గురు ట్రేడర్లపై క్రిమినల్​కేసుల నమోదు చేశారు. దీంతో వ్యాపారులు మార్కెట్​లో కొనుగోళ్లు బంద్​పెట్టారు. తొలుత ట్రేడర్లు తమపై పెట్టిన కేసులు ఎత్తివేస్తేనే కొనుగోళ్లు జరుపుతామని మొండికేశారు. వీరి బంద్​ ప్రభావానికి తోడు మధ్యమధ్యలో మార్కెట్​కు సెలవులు కూడా వచ్చాయి. 

దీంతో వేలాది బస్తాల వరి ధాన్యం పేరుకుపోవడంతో రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ఈనెల16న యార్డులోపల ఉన్న ధాన్యాన్ని ఈ నామ్​ పద్ధతిలో నాణ్యత ఆధారంగా ట్రేడర్లకు చాన్స్​ఇచ్చి కోనుగోళ్లు జరుపుకునే అవకాశం కల్పించారు. ఆరోజు 15 వేల పై చిలుకు బస్తాల ధాన్యం కొనగా రూ.1713 నుంచి రూ.2 వేల వరకు ధర వేశారు. ఆ మరుసటి రోజు శ్రీరామనవమి పేరుతో మార్కెట్​కు సెలవు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఏదో కారణం చెప్తూ మార్కెట్​కు సెలవులు ఇస్తూ వస్తున్నారు. శనివారం ఇచ్చిన ప్రకటనలో తాము చెప్పేంత వరకు మార్కెట్​కు ధాన్యం తీసుకురావద్దని స్పష్టంగా పేర్కొన్నారు. ఆదివారం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సోమవారం కూడా కొనుగోళ్లు జరిగే అవకాశం లేదనే అర్థం చేసుకోవచ్చు. 

అత్యవసరానికి తప్పని ఇక్కట్లు

ధాన్యాన్ని సర్కారు కొనుగోలు సెంటర్లలో పోసి అమ్మాలంటే కనీసం వారం 10 రోజలన్నా పడుతుంది. దీంతో అత్యవసరానికి అమ్ముకుని వచ్చిన కాడికి డబ్బులు తెచ్చుకుందామనుకునే రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పుడు తప్పని సరిగా సెంటర్ల వద్దకే వెళ్లాల్సి వస్తోంది. అధికారులు కూడా ఇదే కోరుకుంటున్నారు. కాస్త ఇబ్బందైనా ప్రభుత్వ మద్దతు ధర లభించి మేలు జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. ఓపిక తెచ్చుకుని సర్కారు సెంటర్లలోనే అమ్ముకోవాలంటున్నారు. కాగా, ట్రేడర్లు మాత్రం వివిధ ప్రాంతాల్లోని మార్కెట్​యార్డుల్లో నాణ్యత ఆధారంగా ఈ నామ్​పద్ధతిలో కొనుగోళ్లు జరుగుతుంటే జనగామ మార్కెట్​లో పరిస్థితి వేరేగా ఉందని వాపోతున్నారు.