- నల్గొండ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న లీడర్లు
- హైకమాండ్‌పై ఒత్తిడి పెరుగుతుండడంతో అభ్యర్థిని మార్చే చర్చ
- మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి ప్రయత్నాలు వేగవంతం
నల్గొండ, వెలుగు: నల్గొండ బీజేపీలో ముసలం పుట్టింది. ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని మార్చాలని పార్టీ సీనియర్లు పట్టుబడుతున్నారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్లు, పలువురు సీనియర్లు మంగళవారం రహస్య ప్రదేశంలో భేటీ అయినట్టు తెలిసింది. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డిని ఎంపీగా నిలబెట్టాలని తెర వెనక ప్రయత్నాలు వేగవంతం చేసినట్టు సమాచారం.
సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే ముందు తేరా చిన్నప రెడ్డితో స్టేట్ పార్టీ చర్చలు జరిపింది. పార్టీలోకి వస్తే నల్గొండ ఎంపీ టికెట్ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ అప్పుడు ఆయన బీఆర్ఎస్ టికెట్ వస్తుందనే నమ్మకంతో బీజేపీ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. కానీ, కవిత అరెస్ట్ నేపథ్యంలో చిన్నప రెడ్డి మళ్లీ బీజేపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటికే సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగిపోయింది.
సైదిరెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్లు
సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని పార్టీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోడు భూముల ఆక్రమణలో ఆయన పాత్ర ఉందని, గిరిజనులకు అండగా ఉన్న బీజేపీ నాయకులపై దాడులు చేయించి, అక్రమంగా కేసులు పెట్టించారని ఫైర్ అవుతున్నారు. అంతేగాక, అప్పటి పార్టీ చీఫ్ బండి సంజయ్ రాకను అడ్డుకుని వాహనాలను ధ్వంసం చేయించాడని భగ్గుమంటున్నారు. ఇంకోవైపు ఎంపీ టికెట్ కోసం నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్లు తీవ్రంగా ప్రయత్నించారు.
వీళ్లను కాదని భువనగిరి, నల్గొండ రెండు చోట్ల బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకే పార్టీ టికెట్ఇవ్వడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాక నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు కలిపి జరిగిన పార్లమెంటరీ మీటింగ్‌కు పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు. కొద్దిరోజుల కింద హైదరాబాద్‌లో స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎంపీ క్యాండిడేట్లతో మీటింగ్జరిగింది. ఎంపీ ఎన్నికల కార్యచరణ మొదలు పెట్టాలని ఆయన ఆదేశాల మేరకు బుధవారం నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు కలిపి సోషల్ మీడియా వారియర్స్ పే రుతో నల్గొండలో మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు.
ఈ మీటింగ్‌కు ఒక్క రోజు ముందు సీనియర్లు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్లు ఒక చోటికి చేరి రహస్యంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. సైదిరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో సహరించేది లేదని, చిన్నప రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాలని హైకమాండ్ వ్యతిరేక వర్గం ఒత్తిడి చేస్తోంది. చిన్నప రెడ్డి సైతం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
నేటి నుంచే ఎన్నికల కార్యాచరణ షురూ..
బీజేపీ ఎన్నికల కార్యచరణ నేటి నుంచి షురూ కానుంది. హైకమాండ్ ఆదేశాల మేరకు బుధవారం సోషల్ మీడియా వారియర్స్‌తో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 25 వరకు నెల రోజుల టైం టేబుల్ ఫిక్స్ చేశారు. నామినేషన్ల షెడ్యూల్ విడుదల చేయకముందే రెండు సార్లు గ్రామాల్లోకి వెళ్లి ఓటర్లను కలవాలని పార్టీ ఆదేశించింది. బూత్ కమిటీలు, బూత్కో కోఆర్డినేటర్‌ను నియమించి, కేంద్ర పథకాల గురించి ప్రచారం చేయాలని చెప్పింది. ముఖ్యంగా 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్రద్దు, ఆయోధ్య రామమందిరం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. పార్టీ పరంగా ఇదంతా జరుగుతుండగానే సీనియర్లు తిరుగుబాటు చేయడంతో పార్టీ కేడర్అయోమయంలో పడింది.