పోరాట.. ప్రజా ఉద్యమాలకు ఊపు, ఉత్సాహాన్ని అందిస్తది. జనాన్ని జాగృతం చేసి.. పోరుబాట పట్టిస్తది. అదే పాట మన సంస్కృతి, సంప్రదాయాలకు దివిటీ అయితది. అందుకే ‘పాట మానకే ప్రాణమైనపోని’ అంటారు గోరటి వెంకన్న.
పంట పండినా పాటే.. ఎండినా పాటే, గెలిచినా పాటే.. ఓడినా పాటే అంటూ జీరగొంతుతో సాగిపోతున్న పల్లెటూరి పాలమూరు గార్వాల ముద్దుబిడ్డ గోరటి వెంకన్న. ప్రకృతి సోయగాలతో సామ్రాజ్యవాద విష సంస్కృతికి సవాల్ విసిరే మట్టి పాటల ఊట.
కాలి దుమ్ము కంట్లో ఎగిసిపడుతున్నట్లు గజ్జెకట్టి చిందేసి, దర్వేసి.. గోసి, గొంగడేసి, గర్జిస్తూ.. గంతులేస్తూ పాటకు జీవం పోస్తూ కలగలిసిపోయిన 4 కోట్ల తెలంగాణ ప్రజా సమూహానికి నిలువెత్తు నిదర్శనం మా గోరటి వెంకన్న. తన ఆట పాటలతో గోల్కొండ ఖిల్లమీద గోగుపువ్వులు పూయించాడు, సుత్తి కొడవళ్త మీద ముత్యమై మెరిపించాడు.
ఈ దేశానికి తిండి పెట్టింది నా పల్లెలు. ఈ దేశానికి సంపదల్ని, సౌందర్యాలనందించినవి నా పల్లెలు. మరి నా పల్లెలపై యుద్ధమెందుకు? నేను, నా పల్లెలు చేసిన నేరమేంటి? నన్ను వెంటాడీ, వేటాడి సంపడమెందుకు? అంటూ రాజ్యహింసను ప్రశ్నిస్తూ రచ్చకీడ్చిండు!
ప్రపంచీకరణతో ఛిద్రమైపోతున్న కుల వృత్తులకు గొంతుకై సామ్రాజ్య వాద విష సంస్కృతికి సవాల్ విసిరినడు. ‘పల్లేకన్నీరు పెడుతుందో… కనిపించని కుట్రల.. నా తల్లీబందీయైపోయిందో.. కనిపించనికుట్రల’ అంటూ పల్లె కన్నీటిని ప్రపంచానికి తెలిపి.. సర్కారోళ్లని కడిగేసిండు.
పల్లె ప్రకృతి, చెరువుల సోయగాల సౌందర్యాన్ని ‘నా పల్లె అందాలు చూసితే కనువిందురో’ అంటూ వాగులు, వంకలు, డొంకలు, ఈదులు, మోదుగులు, తంగేడు, నల్లాలం, నల్లతుమ్మ సెట్లను యాదిజేసిండు.
వానొస్తే పులకించిండు.. ఎండొస్తే వలపోసిండు.. కయ్యమొస్తే కత్తి దూసిండు.. మోదుగపూల వనంలో నక్సల్బరి ఉద్యమ నావకు ఊపిరులందించిన ప్రజా పోరాటాల అమరులను తన పాటతో అజరామరం చేసిండు. ‘గిచ్చన్న గిరిమల్లెలో నక్సల్బరి నావ కదులుతున్నదో’ అంటూ గంతులేస్తు గర్జించాడు.
‘అందాల తాజ్ మహల్ కన్న అందాల నా వాగు పిచ్చుక గూల్లే మిన్న’ అని నమ్మిన ఓ పల్లెటూరి పాలమూరు గార్వాల పోరగాడి బాధలు, గాధలు, భావాలు, భావజాలాలు జీరగొంతై వినమ్రంగా వినసొంపుగా మారుమ్రోగుతాంది.
అందాల హైద్రాబాద్ సిటీ గల్లీల్లపోంటి గరీబోల్ల బాధల్ని, గాధల్ని ‘గల్లీ చిన్నది.. గరీబోల్ల కథపెద్దది’ అంటూ బాధ్యతగా ప్రపంచ తెలుగు మహాసభలో వినిపించాడు. ఊరవతలి జీవితాల దుఃఖాన్ని పాటలో సిత్రించిండు. సంతలో సిధ్రమైపోతున్న బతుకుల్నిచూసి బతుకే ఓ సంత అన్న బైరాగితత్వం ఆయనకే సొంతం. అగ్రవర్ణాల కుటిల నీతుల్ని బజార్ కీడ్చి రచ్చబండ దగ్గర ‘హవ్వారే మాదోరో.. వరుస మార్సుకున్నడో.. వడుపు నేర్చుకున్నడో..’ అంటూ యచ్చగానం జేసిండు. కమ్యూనిస్టు మహా సభలో రాజకీయ నాయకుల ఓట్ల మాయాజాల మందు బాగోతాల్ని ఇప్పిజెప్పుతూ ‘ఓటేడ నేతురన్న నీ ఓటు నా ఓటు పోలిసోడే వేసే’ అంటూ విచ్ఛిన్నకర రాజకీయాల్ని ఎండగట్టినడు.
తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ల నీళ్ళ దోపిడీల్ని నిగ్గదీసిండు. పాలక వర్గాల్ని ప్రశ్నించే విద్యార్థి, ఉద్యమ వీరుల వెంట పాటై దూకిండు. సెక్రటేరియట్ లో నీవు సెక్రం దిప్పుడేందని ‘పొమ్మంటే పోవేందిరా … పోరా ఓ ఆంధ్రోడా’ అంటూ హెచ్చరించిండు. భారతావనిలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించినంక మురిసిపోయిండు. పల్లె జానపదాల విజ్ఞాన గని.. యాసభాసలో పాటలకు ప్రాణం పోసిన పోరగాడు.. ప్రకృతి పాటల పులకింతల్లో ఒదిగిపోయే.. ఈ గోరటి జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవిసూసినడు. అనుమానం , అవమానాల్ని ఎదర్కొండు. సుఖ దుఃఖాల్ని సమానంగా భరిస్తు కల్మషం లేని పాటల పుట్టగా వెలుగొందుతున్నడు. ప్రకృతి ఒడిలో బాటసారిగా సాగిపోతున్న ఓ సాదు బైరాగి జీరగొంతు పాటకు పట్టాభిషేకం జరుగుతున్నది. పెద్దల సభలో ఆ గొంతుక మార్మోగబోతున్నది. నిరుద్యోగులు, అణగారిన వర్గాల సమస్యలపై మండలిలో గోరటి వెంకన్న ‘జంగ్ సైరన్’ మోగించాలి. -సదానందం గౌడ్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అసోసియేట్ ప్రెసిడెంట్.
Read more news…