కేజ్రీవాల్ వర్సెస్ సీఈసీ..యమునా నీటి కాలుష్యంపై మాటల యుద్ధం

కేజ్రీవాల్ వర్సెస్ సీఈసీ..యమునా నీటి కాలుష్యంపై మాటల యుద్ధం
  • యమునా నీటి కాలుష్యంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం
  • సాక్ష్యాధారాలు ఇవ్వాలని కేజ్రీవాల్ కు ఈసీ ఆదేశం 
  • లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • సీఈసీ కామెంట్లపై కేజ్రీవాల్ ఫైర్
  • యమున నీటిని తాగే దమ్ముందా? అని సవాల్‌‌‌‌

న్యూఢిల్లీ: యమునా నది విషయమై ఆప్ చీఫ్ కేజ్రీవాల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. హర్యానా ప్రభుత్వం యమునా నదిలోకి అమ్మోనియా వ్యర్థాలు వదులుతున్నదని కేజ్రీవాల్ చేసిన కామెంట్లపై ఈసీ  నోటీసులు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ రిప్లై ఇవ్వగా.. గురువారం ఈసీ ఘాటుగా స్పందించింది. ఈ అంశాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంలా చూడొద్దని కేజ్రీవాల్‌‌‌‌కు సూచించింది. శుక్రవారం ఉదయం 11 గంటల్లోపు సాక్ష్యాలను ఢిల్లీ జల్‌‌ బోర్డుకు సమర్పించాలని ఆదేశించింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈసీ కామెంట్లపై కేజ్రీవాల్ కూడా ఘాటుగా స్పందించారు. మూడు బాటిళ్లలో యమున నీటిని పంపిస్తానని, వాటిని తాగే దమ్ముందా? అని సీఈసీ రాజీవ్ కుమార్​కు సవాల్ విసిరారు. ప్రెస్​మీట్ పెట్టి.. ఆ నీళ్లు తాగాలని డిమాండ్ చేశారు. అలా తాగితే.. తప్పు చేశామని ఒప్పుకుంటామన్నారు. 
మాజీ సీఎం అయి ఉండి ఇలా మాట్లాడుతారా? యమునా నదిలో హర్యానా ప్రభుత్వం అమ్మోనియా వ్యర్థాలు కలుపుతున్నదంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు సరికావని ఈసీఐ తెలిపింది. శుక్రవారం ఉదయం 11లోపు జల్ బోర్డుకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ‘‘యమునా నదిలో అమోనియా స్థాయిలు పెరగడాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంలా చూడొద్దు. ఈ అంశాన్ని కేజ్రీవాల్​.. ఓ నరమేధంలా చూడటం తగదు. మీరు చేసిన కామెంట్లు రెండు వర్గాల మధ్య శత్రుత్వం, అశాంతిని పెంచేలా ఉన్నాయి. మీ కామెంట్లు ఢిల్లీ, హర్యానా ప్రజల మధ్య సంబంధాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. మీరొక మాజీ సీఎం.. ప్రజా ప్రతినిధి. మీ కామెంట్లు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మేము గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నం. యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతున్నదనే ఆరోపణలపై సాక్ష్యాధారాలు ఇవ్వకపోతే.. మీపై చర్యలు తీసుకుంటాం’’అని కేజ్రీవాల్​ను  ఈసీ హెచ్చరించింది. 

ఈసీ రాజకీయాలు చేస్తున్నది..

ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతను సీఈసీ రాజీవ్ కుమార్ నాశనం చేశారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘‘సీఈసీ పంపిన నోటీసుల్లో ఉపయోగించిన భాష సరిగా లేదు. ఎన్నికల కమిషన్​ను నేను నమ్మను. ఈసీఐ ఎప్పుడో అపఖ్యాతి పాలైంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రతిపక్షాలు డబ్బుల్ని వెదజల్లుతుంటే పట్టించుకోవడం లేదు. రాజకీయాలు చేయడంలో బిజీ అయింది. సీఈసీ రాజీవ్ కుమార్ త్వరలో రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలు చేయాలనుకుంటున్నారేమో? ఆయన్ను చరిత్ర ఎప్పటికీ క్షమించదు. నన్ను వాళ్లు రెండు రోజుల్లో అరెస్ట్ చేయొచ్చు. అయినా భయపడను. ఇప్పటి దాకా ఇలాంటి ఎన్నికలు దేశ చరిత్రలో జరగలేవు’’ అని కేజ్రీవాల్ అన్నారు.