- మీరు పవర్లో ఉన్నప్పుడు సొంతమైన ఫామ్‌హౌస్.. ఇప్పుడు లీజుకు ఎట్లాయె?
- కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
- అక్రమ ఫామ్‌హౌస్‌ల కూల్చివేతను సమర్థిస్తున్నట్లు వెల్లడి
సికింద్రాబాద్, వెలుగు : జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చాలా లాజిక్‌గా మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘‘జన్వాడ ఫామ్‌హౌస్ నీది కాకుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్ వీడియో తీశారని అప్పట్లో రేవంత్‌రెడ్డిపై కేసు ఎందుకు పెట్టినవ్?” అని కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడేమో ఫామ్‌హౌస్ సొంతమైనప్పుడు, ఇప్పుడు లీజుకు ఎట్ల అయిందని నిలదీశారు. బుధవారం సికింద్రాబాద్ క్లాసిక్గార్డెన్లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్ తానొక్కడినే సంసారి అయినట్లు .. అమాయకుడి లెక్క మాట్లాడుతున్నడు” అని విమర్శించారు. అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్‌ల కూల్చివేతలను సమర్థిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తీసుకురావడం వెనుక మహారాష్ట్ర, హర్యానా ఎలెక్షన్ల కోసం కలెక్షన్ల దందా దాగి ఉందని ఆయన ఆరోపించారు. ‘‘గుంట, రెండు గుంటల స్థలాల్లో ఇండ్లు కట్టుకుంటే కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు.. ఎకరాల కొద్ది ఫామ్‌హౌస్‌లు కట్టుకుంటే వాటిని ఎందుకు కూల్చడం లేదు? పెద్దతలకాయలను వదిలేసి గజాల్లో కట్టిన ఇండ్లను మాత్రమే హైడ్రా కూల్చుతున్నది. ఇది సరైంది కాదు” అని ఆయన అన్నారు.
సింఘ్వీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థి
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే ఒప్పందంలో భాగంగానే రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీని ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాయని బండి సంజయ్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని ఆ పార్టీ ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసును అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారని, అందుకు ప్రతిఫలంగానే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించలేదని ఆయన విమర్శించారు.
దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టికి మరల్చడానికి విగ్రహాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. సెక్రటేరియెట్ ముందు వాజ్‌పేయి విగ్రహం పెట్టాలని తమకూ ఉందని, ఇకనైనా విగ్రహాల లొల్లి మానేయాలని, ప్రజా సమస్యలపై దృష్టిసారించాలన్నారు.