ఇందూరు కాంగ్రెస్‌‌లో ముదురుతున్న లొల్లి

నిజామాబాద్‌‌, వెలుగు:  జిల్లా ప్రెసిడెంట్, పీసీసీ పదవులపై కాంగ్రెస్‌‌ సీనియర్ల మధ్య ఆధిత్య పోరు తారా స్థాయికి చేరుతోంది. ఇటీవల ప్రకటించిన ఈ పదవుల్లో రెడ్డి వర్గీయులకే పెద్దపీట వేయడంతో ఇతర వర్గాల నాయకుల్లో అసంతృప్తి వ్యక్తం అమవుతోంది. మరో వైపు పార్టీ సిట్టింగ్ ప్రెసిడెంట్ మానాల మోహన్‌‌రెడ్డిపై మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్‌‌ మధుయాష్కీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో దూమరం రేపుతున్నాయి. ఈ కామెంట్స్‌‌తో జిల్లా కాంగ్రెస్‌‌లో మాజీ మంత్రి సుదర్శన్ టీమ్‌‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. 

మాజీ మంత్రి కౌంటర్‌‌..‌‌ 

డీసీసీ భవన్‌‌లో రెండు రోజుల కింద జరిగిన జిల్లా మీటింగ్‌‌కు మహేశ్‌‌గౌడ్, మధుయాష్కీతో పాటు వారి అనుచరులు  గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, టీపీసీసీ ట్రెజరర్‌‌‌‌ సుదర్శన్‌‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే నేతలపై హైకమాండ్‌‌ క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ కామెంట్స్‌‌ చేశారు. పరోక్షంగా అగ్రనేతల తీరుపైనే మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని ప్రధాన చర్చ జరుగుతోంది.

మూడేళ్లుగా వార్‌‌‌‌.. 

మాజీ మంత్రి సుదర్శన్‌‌రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీల మధ్య మూడేండ్లుగా విబేధాలున్నా యి. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల ఇన్‌‌చార్జిగా సుదర్శన్‌‌రెడ్డి నియమితులయ్యారు. కానీ ఎంపీ అభ్యర్థిగా మధుయాష్కీ నామినేషన్ అనంతరం ఎన్నికల ఇన్‌‌చార్జి పదవి నుంచి సుదర్శన్‌‌రెడ్డి తప్పుకున్నారు. సీనియర్ నేత తప్పుకోవడంతో పార్టీ కార్యకర్తలు డీలాపడ్డారు. ఆ ఎన్నికల్లో మధుయాష్కీ ఓడిపోయారు. అప్పటి నుంచి వారి మధ్య వార్ మొదలైంది. ఏడాది కింద టీపీసీసీ  ప్రచార కమిటీ చైర్మన్‌‌గా మధుయాష్కీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌‌, బోధన్‌‌లో నిర్వహించిన స్వాగత సభలకు మాజీ మంత్రి సుదర్శన్‌‌ రెడ్డి హాజరు కాలేదు. అనంతరం బోధన్ ముఖ్య నేతలతో హైదరాబాద్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌కు మధుయాష్కీ డుమ్మా కొట్టారు. 

ఈ క్రమంలో అప్పట్లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌‌రెడ్డి జోక్యంతో విబేధాలకు తెరపడ్డాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. తర్వాత నిజామాబాద్‌‌లో కాంగ్రెస్ సభ్యత్వ మీటింగ్‌‌లో మధుయాష్కీపై క్రమశిక్షణ చర్యలకు మాజీ ఎమ్మెల్యే అనిల్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనిల్‌‌ మాజీ మంత్రి సుదర్శన్‌‌రెడ్డికి సన్నిహితుడిగా ఉండడం.. ఆయనే తెరవెనుక ఉండి చేయించార నే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. తాజాగా సుదర్శన్‌‌రెడ్డి వర్గీయులుగా ఉన్న  తాహెర్ బిన్ హందాన్‌‌ టీపీసీసీ వైస్‌‌ ప్రెస్‌‌డెంట్‌‌గా, గంగాధర్, నగేశ్‌‌ రెడ్డిలకు  టీపీసీసీ సెక్రటరీలుగా పదవులు దక్కాయి. జిల్లా ప్రె సిడెంట్ పోస్ట్‌‌ గతంలో పనిచేసిన మానాల మోహన్‌‌రెడ్డి దక్కింది. బీసీ ప్రాబల్యం ఉన్న జిల్లాలో హైకమాండ్‌‌ రెడ్డి సామాజిక వర్గం వైపు మొగ్గు చూపడం మరోమారు వర్గపోరుకు దారి  తీసినట్లయ్యింది.

పార్టీ సిట్టింగ్ ప్రెసిడెంట్ మానాల మోహన్‌‌రెడ్డి పనితీరు బాగాలేదు. దీనిపై పార్టీ వ్యూహకర్త నుంచి హైకమాండ్‌‌కు రిపోర్ట్ కూడా వెళ్లింది. అయినా అతడికే ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చారు.

- మధుయాష్కీ,  టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌‌

కాంగ్రెస్‌‌ పార్టీలో హైకమాండే ఫైనల్‌‌. పార్టీ ఏ నిర్ణయం తీసుకుకున్నా.. అందరూ స్వాగతించాలి. కాదని వ్యతిరేకంగా పని చేస్తే.. అలాంటి నేతలపై తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి.

- సుదర్శన్‌‌రెడ్డి, టీపీసీసీ ట్రెజరర్‌‌‌‌