మోడీ వర్సెస్ ఖర్గే: ప్రధాని, ఏఐసీసీ చీఫ్ మధ్య మాటల యుద్ధం

మోడీ వర్సెస్ ఖర్గే: ప్రధాని, ఏఐసీసీ చీఫ్ మధ్య మాటల యుద్ధం

ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. హర్యానా ప్రజలు కాంగ్రెస్‎ను తిరస్కరించారని.. ప్రజలకు కావాల్సింది అభివృద్ధే కానీ.. అబద్ధపు హామీలు కాదని మోడీ కాంగ్రెస్‎ను టార్గెట్ చేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా రుణమాఫీ చేయలేదని.. ఇప్పటికీ రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‎లోనూ కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని మండిపడ్డారు. గ్యారెంటీలు, ఉచిత పథకాలపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వడం సులభమేనని.. కానీ వాటిని అమలు చేయడం కష్టమని కాంగ్రెస్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యిందని మోడీ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మోడీ వ్యాఖ్యలకు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు, మోసం, లూటీ, బూటకం, పబ్లిసిటీపైనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ నడుస్తోందని విమర్శలు గుప్పించారు.

Also Read : బడ్జెట్ చూసుకుని హామీలు ఇవ్వాలి

ఎన్డీఏ 100 రోజుల పాలన అనేది ఓ చిల్లర స్టంట్ అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. మరీ ఆ హామీ ఏమైందని ఖర్గే నిలదీశారు. కాగా, మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్ర  ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గ్యారెంటీలు ఇవ్వాలని.. అమలు చేయలేని గ్యారెంటీలు హామీ ఇచ్చి ప్రజావ్యతిరేకత మూటగట్టుకోవద్దని కాంగ్రెస్ శ్రేణులకు మల్లికార్జున ఖర్గే సూచించిన విషయం తెలిసిందే. దీంతో ఖర్గే వ్యాఖ్యలపై మోడీ రియాక్ట్ అవుతూ.. కాంగ్రెస్‎పై విమర్శలు సంధించారు.