దాసోజు సూచనలపై సీరియస్
మాట్లాడుతుండగా ఉత్తమ్ అడ్డు
నిన్నగాక మొన్న వచ్చిన నువ్వు చెబుతున్నావా: నిరంజన్
ఆరేళ్లు పార్టీ కోసం కష్టపడితే ఇంత అవమానమా?: దాసోజు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ లీడర్లు నిర్వహించిన సమావేశం రసాభాసగా సాగింది. ప్రశ్నలు, నిలదీతలతో నేతల మధ్య మాటల ఫైట్ నడిచింది. ఎన్నికలు కొద్ది నెలల్లోనే ఉన్నా ఎలాంటి ప్రిపరేషన్ జరగడం లేదని, నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్ర నాయకత్వాన్ని కొందరు ప్రశ్నించా రు. ఇప్పటికే ఆలస్యమైందని, ఇకనైనా మేలుకోవాలని కోరారు. మంగళవారం ఇందిరా భవన్ లో జరిగిన మీటింగ్ లో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఏఐసీసీ నేషనల్ స్పో క్స్ పర్సన్ దాసోజు శ్రవణ్ కుమార్, సిటీ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ , పార్టీ నేతలు నందికంటి శ్రీధర్, నగేశ్ ముదిరాజ్ , నిరంజన్, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
అభిప్రాయాలు చెబితే దౌర్జన్యమా?: దాసోజు
డివిజన్ల వారీ మేనిఫెస్టోలతోపాటు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలపై చార్జి షీట్లు వేయాలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను టీఆర్‌ఎస్ ఎట్లా నిర్వీర్యం చేసిందో ఎండగట్టాలని దాసోజు శ్రవణ్ కుమార్ సూచించారు. డివిజన్ ఇన్ చార్జులను నియమించాలని, మహిళా కమిటీ వేసి ప్రచారం చేయాలని, పార్టీ పరిస్థితిని బట్టి డివిజన్లను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించుకొని పని చేయాలని సూచించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఉత్తమ్ జోక్యం చేసుకున్నారు. ‘‘నువ్వు ఖైరతాబాద్ ఇన్చార్జివి కదా, మీ దగ్గర ఎంత వర్క్ అయింది’’ అని ప్రశ్నించారు. దీనికి శ్రవణ్ సమాధానం చెబుతున్న సమయంలో పార్టీ జనరల్ సెక్రటరీ నిరంజన్ కల్పించుకున్నారు. ‘‘నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన నువ్వు చెబుతున్నావా?’’ అంటూ విమర్శించారు. దాసోజు సమాధానం ఇస్తూ ‘‘ఆరేళ్ల నుంచి రాత్రి పగలు అనకుండా రక్తం, చెమట ధారపోసి పార్టీ కోసం పని చేసినం. కుటుంబ జీవితాన్ని పట్టించుకోకుండా కష్టపడితే ఇదా మీరు గౌరవించే తీరు’’ అంటూ ఫైర్ అయ్యారు. ‘‘పార్టీలో ఇంటర్నల్ డిసిప్లిన్ లేదు. ఇంకా పాత, కొత్త ఏమిటి? అభిప్రాయాలు చెబితే దౌర్జన్యానికి దిగుతారా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో దాసోజు, నిరంజన్ కొట్లాటకు దిగే పరిస్థితి వచ్చింది. ఇతర నేతలు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు.
ఇప్పటికే లేట్ అయింది..
టీఆర్‌ఎస్ పై జనంలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, దాన్ని కాంగ్రెస్‌ను అనుకూలంగా మార్పుకునే ప్రయత్నం చేయాలని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్, ఓటర్ లిస్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, టీఆర్‌ఎస్, ఎంఐఎంలు వీటిలో గోల్‌మాల్ ఆధారంగానే గెలవాలని చూస్తున్నాయని నేతలు హెచ్చరించారు. ‘‘డీలిమిటేషన్ అడ్డగోలుగా చేశారు. కొన్ని డివిజన్లలో 30 వేల మంది ఓటర్లుంటే, కొన్నింటి లో 70 వేల మంది ఉన్నారు. దీని మీద మనం గతంలో కొట్లాడినం. ఇపుడు కూడా ఫైట్ చేయాలి. ఇప్పటి కే గా లేట్ అయ్యింది. ఇప్పటి కైనా సీరియస్‌గా తీసుకోవాలి’’ అని మర్రి శశిధర్ రెడ్డి సూచించారు.
దుబ్బాక బై ఎలక్షన్ పై 11న భేటీ
దుబ్బాక ఉప ఎన్ని క, అభ్యర్థి పరిశీలనపై కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఉత్తమ్, బోసురాజు, దామోదరతోపాటు మెదక్ జిల్లా నేతలు పాల్గొన్నారు. పార్టీ పరిస్థితి, గెలుపోటములు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 11న మరోసారి మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించామని ఉత్తమ్ ప్రకటించారు.
డివిజన్ స్థాయిలో బలోపేతం కావాలి: ఉత్తమ్
డివిజన్ స్థాయిలో పార్టీ బలోపేతం కావాలని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ నెగెటివ్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. టికెట్ల కోసం ఈసారి పోటీ ఉందని, దీన్ని బట్టి పార్టీ పరిస్థితి బాగుందని అర్థమవుతోందన్నారు.రిజర్వేషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. ఎంఐఎం కమ్యూనల్, బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాలతో వెళ్తాయని, కాంగ్రెస్ లౌకిక ఎజెండాతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని వీహెచ్ అన్నారు.
యువ నాయకులను గుర్తించాలి: రేవంత్ రెడ్డి
గ్రేటర్‌లోని 150 డివిజన్లలో యువ నాయకులను గుర్తించాలని, వారి ఆధ్వర్యం లో గడప గడపకు పాదయాత్ర చేసి పార్టీ స్టాండ్ ను ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘డివిజన్‌లోని సమస్యల ఆధారంగా 150 మేనిఫెస్టోలు తయారు చేయాలి. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని డివిజన్లలో మేం ఆల్రెడీ సర్వే పూర్తి చేసినం. బోగస్ ఓట్లను గుర్తించేందుకు, లీగల్‌గా ఫైల్ చేసేందుకు కమిటీలు వేయాలి’’ అని చెప్పారు.