ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ టెన్షన్

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ టెన్షన్
  •      పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు
  •     ప్రతీకారం తీర్చుకుంటామంటున్న ఇరాన్
  •     హమాస్, హెజ్​బొల్లాతో కలిసి దాడికి నిర్ణయం
  •     తగ్గేదే లే అంటున్న ఇజ్రాయెల్
  •     దాడులను తిప్పి కొడ్తమన్న ప్రధాని నెతన్యాహు
  •     ఇజ్రాయెల్​కు అండగా అమెరికా
  •     పశ్చిమాసియాలో బలగాల మోహరింపు

న్యూఢిల్లీ : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. మిస్సైళ్ల దాడులు, బాంబు పేలుళ్లతో పశ్చిమాసియా దద్దరిల్లుతున్నది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హెజ్​బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్రు హత్యతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇద్దరు చనిపోవడానికి ఇజ్రాయెలే కారణమంటూ ఇరాన్ మండిపడుతున్నది. 

దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​పై ఇరాన్ భీకర దాడులకు దిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌‌‌‌ హెచ్చరించారు. ఇరాన్, హమాస్, హెజ్​బొల్లా కలిసి దాడులు చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. 

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఇరాన్​కు దీటుగా బదులిస్తామని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అమెరికా వెల్లడించింది. అందులో భాగంగా పశ్చిమాసియా ప్రాంతంలో అదనపు బలగాలను మోహరిస్తున్నామని తెలిపింది. 
రక్షణ శాఖ అధికారులతో

బెంజమిన్ ఎమర్జెన్సీ మీటింగ్

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. శని, ఆదివారాల్లో ఇజ్రాయెల్, ఇరాన్ ఒకరిపై ఒకరు దాడులకు దిగాయి. హమాస్, హెజ్​బొల్లా ఇజ్రాయెల్​పై భీకర దాడులకు దిగుతాయని అమెరికా చేసిన హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హర్జి హలెవి, మొస్సద్, షిన్ బెట్ చీఫ్​లు డేవిడ్ బర్నేనా, రొనెన్ బార్‌‌‌‌తో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జెరూసలేంలోని పీఎం ఆఫీస్​లో అత్యవసర సమావేశం నిర్వహించారు.

 బార్డర్​లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు ఐరన్ డ్రోమ్​లను యాక్టివ్​లోనే ఉంచాలని సూచించారు. అటాక్​లను దీటుగా తిప్పికొట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. తమపై దాడులకు దిగిన వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నెతన్యాహు హెచ్చరించారు. కాగా, ఇరాన్ దాడి చేసే వరకు వేచి చూడటం కన్నా.. ముందే దాడి చేయాలనే ప్లాన్​లో ఇజ్రాయెల్ ఉన్నట్లు తెలుస్తున్నది.

సైనిక స్థావరాలే లక్ష్యం

సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరి పై ఒకరు దాడులు చేసుకునే అవకాశం ఉందని సమా చారం. ఇరాన్​పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్​కు తమ పూర్తి సహకారం ఉంటుందని ఇప్పటికే అమెరికా స్పష్టం చేసింది. కాగా, సోమవారం తెల్లవారుజామున లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ అయిన హెజబొల్లా.. నార్త్ ఇజ్రా యెల్ పై డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు. 

దాడిని ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. సౌత్ లెబనాన్​లోని గ్రామాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ అటాక్​లు చేశామని హెజబొల్లా ప్రకటించింది. నార్త్ ఇజ్రాయెల్​లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని ప్రకటనలో స్పష్టం చేసింది.

గాజా నుంచి ఇజ్రాయెల్​పై దాడులు

పాలస్తీనా మిలిటెంట్లు గాజా నుంచి తమపై 15 మిసైళ్లతో దాడి చేశారని ఇజ్రాయెల్ ఆర్మీ సోమవారం ప్రకటించింది. ఈ దాడిలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారని తెలిపింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడిని ఖండిస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ గాజాపై విరుచుకుపడుతున్నది. ఇరాన్​కు చెందిన ఇద్దరు కీలక నేతల హత్యల తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 

దీంతో గాజా నుంచి ఇజ్రాయెల్​పై దాడులు మొదలయ్యాయి. మోర్టార్ షెల్స్, రాకెట్లు, డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ప్రయోగించిన రాకెట్లలో చాలా వరకు ఇజ్రాయెల్ అడ్డుకున్నది. కొన్ని ఓపెన్ ఏరియాల్లో పడ్డాయి. దీంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. 

మమ్మల్ని మేం కాపాడుకోగలం : ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ

ఇజ్రాయెల్ దాడులను దీటుగా ఎదుర్కొంటామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనాని సోమవారం స్పష్టం చేశారు. తనను తాను కాపాడుకోగల శక్తి ఇరాన్​కు ఉందన్నారు. ఇజ్రాయెల్​పై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. 

మెరుపు దాడులు చేస్తం: ఇరాన్

ఇస్మాయిల్‌‌‌‌ హనియా, ఫాద్ షుక్రును హత్య చేసి ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ హుస్సేన్ సలామీ ఫైర్ అయ్యారు. తన సమాధి.. తానే తవ్వుకుంటోంద న్నారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తారని తేల్చి చెప్పారు. ఎప్పుడు.. ఎలా.. ఎక్కడ దాడులు చేస్తామో ఇజ్రాయెల్ చూస్తుండాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు.

ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉంది: అమెరికా

జీ7 దేశాల మంత్రుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌‌‌‌ కీలక కామెంట్లు చేశారు. ‘‘ఇజ్రాయెల్‌‌‌‌పై ఇరాన్‌‌‌‌, హెజ్‌‌‌‌బొల్లా దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. అయితే, ఎలా, ఏ సమయంలో ఈ దాడులు ఉండొచ్చనేది మాత్రం కచ్చితంగా తెలియదు. ఇరాన్, హమాస్, హెజ్​బొల్లా కలిసి దాడులకు దిగుతాయని తెలుసు. ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటాయనేదానిపై సమాచారం లేదు. 

ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా చల్లబర్చాల్సిన అవసరం ఉంది’’అని తెలిపారు.  పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నట్లు వైట్​హౌస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌‌‌‌తో కలిసి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు.