హెల్మెట్‌తో యుద్ధం : కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది..!

హెల్మెట్‌తో యుద్ధం : కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది..!

కూర్చున్న చోటు నుంచి కాలు కదపాల్సిన పని లేదు. ఆగమేఘాలపై సిద్ధం కావాలని సైన్యానికీ చెప్పక్కర్లేదు. జస్ట్ మైండ్‌‌‌‌లో అనుకుంటే చాలు! యుద్ధ విమానాలు వాటంతటవే గాల్లోకి లేస్తాయి. డ్రోన్లు ఆయుధాలతో సిద్ధమైపోతాయి. ఎగురుకుంటూ సరిహద్దును దాటుతాయి. మరొక్కసారి దాడి చేయాలి అనుకుంటే చాలు శత్రుదేశాన్ని చిన్నాభిన్నం చేసేస్తాయి. అమెరికా తయారు చేయబోతున్న సరికొత్త టెక్నాలజీ ఇదే. ఇలా అత్యాధునిక ఆయుధాలను ఆపరేట్ చేసేందుకు ఒక హెల్మెట్‌‌‌‌ను డిఫెన్స్ అడ్వాన్స్‌‌‌‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (దర్పా) తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన టెక్సస్‌‌‌‌కు చెందిన పరిశోధకుడికి 18 మిలియన్ డాలర్లు (సుమారు రూ.125 కోట్లు)  కేటాయించింది.

మనిషి మెదడుతో హెల్మెట్ కనెక్ట్ అయ్యేందుకు జీన్ థెరపీని వాడతారు. దీని ద్వారా మనిషి ఆలోచనలను, హెల్మెట్ ఆయుధాలకు చేరుస్తుంది. అదే విధంగా హెల్మెట్లు పెట్టుకుని ఉన్న మిగతా వాళ్లతో ఇతడి ఆలోచనలను షేర్ చేస్తుంది. ఈ హెల్మెట్ తయారు చేసే ప్రాజెక్టుకు ది మ్యాగ్నటిక్, ఆప్టికల్ అండ్ అకౌస్టిక్ న్యూరల్ యాక్సెస్ (మోవానా) అని పేరు పెట్టారు. ఇది తలకు పెట్టుకోగానే, మెదడులోని కొన్ని న్యూరాన్లతో అనుసంధానం అవుతుంది. హెల్మెట్ లోంచి వచ్చే కాంతిని న్యూరాన్స్ గ్రహిస్తాయి.

దీని వల్ల మనిషి తలలో ఏయే భాగాలు యాక్టివ్ గా ఉన్నాయో గుర్తిస్తుంది. మరోవైపు హెల్మెట్లోని మ్యాగ్నటిక్ ఫీల్డ్, బ్రెయిన్‌‌‌‌లోని మిగతా న్యూరాన్ల కదలికను గుర్తిస్తుంది. ఇలా ఓ వైపు బ్రెయిన్‌‌‌‌ను స్టడీ చేయడం, మరో వైపు కొత్త యాక్టివీటీ రాసుకుంటూ ఇతరులకు ఆ సమాచారం చేరవేయడం చేస్తుంటుంది. అంతిమంగా వ్యక్తి ఆర్డర్లను అమలు చేస్తుంది.మనిషి మెదడును మెషీన్లకు అనుసంధానం చేయాలని దర్పా ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ దిశగా వేసిన ఐదో అడుగు ‘మోవానా’.  పేద్ద మిషన్స్‌‌‌‌లో సైబర్ డిఫెన్స్ సిస్టమ్స్, యూఏవీలు, కంప్యూటర్ సిస్టమ్స్‌‌‌‌ను హ్యాండిల్ చేయడానికి ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుందని భావిస్తోంది. నాలుగేళ్లలో మనిషి మెదడును మెషీన్లతో విజయవంతంగా అనుసంధానిస్తామని దర్పా ఆఫీసర్లు వెల్లడించారు.