హైదరాబాద్, వెలుగు: వరంగల్ జిల్లా హన్మకొండలో ఓ చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి విధించిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. నిందితుడు పి.ప్రవీణ్ అలియాస్ పవన్ జీవితాంతం జైలులోనే గడపాలని ఆదేశించింది. హన్మకొండలో జూన్ 6న 9 నెలల చిన్నారి అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడు ప్రవీణ్‌కు ఉరి శిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పు చెప్పింది. ఉరి శిక్షను ఖాయం చేయాలన్న ఆ కోర్టు అభ్యర్థనను, నిందితుడి అప్పీలుపై హైకోర్టు సీజే జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది.
అత్యంత అరుదైన కేసుల్లోనే ఉరి శిక్ష..
‘‘ఉరి శిక్ష అమలులో ఉన్న పలు దేశాలతోపాటు అది అమలులో లేని దేశాల్లో ఉన్న నేరాల రేటుకు పెద్ద తేడా లేదు. అందువల్ల ఉరి శిక్షతో సమాజంలో భయాన్ని సృష్టించి నేరాలను తగ్గించాలన్న అభిప్రాయాలు సరికావు. ఉరి శిక్షపై మన దేశంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి” అంటూ సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో వెలువరించిన మార్గదర్శకాలను హైకోర్టు డివిజన్ బెంచ్ వివరించింది. ఉరికి మినహాయింపు ఉందని, యావజ్జీవ కారాగారం విధించవచ్చని, అత్యంత అరుదైన కేసుల్లోనే ఉరి శిక్ష విధించాలంటూ బచన్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపింది. నేరాన్ని అంగీకరించడమే పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లని పేర్కొంది. నిందితుడు పాతికేళ్ల వాడు. వెనుకబడిన తరగతికి చెంది కూలీ. దొంగతనం తప్ప మరే తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు ఆధారాల్లేవని, సంస్కరణకు అతీతంగా నిందితుడు ఉన్నట్లు ప్రాసిక్యూషన్ ఆధారాలు చూపలేకపోయిందని బెంచ్ అభిప్రాయపడింది. ఇలాంటి కేసుల్లో కోర్టులు మధ్యేమార్గాన్ని అనుసరించాల్సి ఉందని తెలిపింది. ఆర్టికల్21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దు గీయడం అంటే జీవించే హక్కు లేకుండా చేయడం కాదంది.