వరంగల్, వెలుగు: వరంగల్‌లో దేశ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే అడ్డుకోవాల్సిన ఏసీపీ గిరికుమార్ ఎమ్మెల్యేకు సెల్యూట్ కొట్టి మరీ వేడుక చూశారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనకు నిరసనగా గురువారం తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనానికి పిలుపునిచ్చారు. ముందస్తు సమాచారం మేరకు ఏసీపీ గిరికుమార్, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో అక్కడికి చేరుకున్నారు. ఈలోగా దిష్టిబొమ్మను దహనం చేయడానికి వచ్చిన నరేందర్‍కు ఏసీపీ సెల్యూట్ కొట్టి పక్కన ఎస్కార్ట్‌లా నిల్చున్నారు.
ఆర్‍ఎస్ లీడర్లు దిష్టిబొమ్మ తెస్తున్నా.. ఏసీపీ, ఇతర పోలీసులుగానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇంకో అడుగు ముందుకేసి దిష్టిబొమ్మ దహనం కొనసాగుతున్నంతసేపు టీఆర్ఎస్ నేతలకు సపోర్ట్‌గా పోలీస్ పెద్దలే ట్రాఫిక్‍ను మళ్లించారు. అదే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఏదైనా కార్యక్రమం చేపడితే మాత్రం పోలీసులు అడ్డుకుంటుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మగ్గంపై కాలు వేశారనే ఆరోపణలతో మంగళవారం చేనేత కార్మికులు దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. ఏసీపీ గిరికుమార్ సిబ్బంది సాయంతో అడ్డుకొని, అందరినీ వాహనాల్లో పడేసి స్టేషన్‌కు తరలించారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ, కుల, ప్రజా సంఘాలు నిరసనలు తెలిపినప్పుడు కూడా ఏసీపీ తన ప్రతాపం చూపారు. పార్టీల రాజకీయ విభేదాల సంగతెలా ఉన్నా ఒక ఉన్నతాధికారిగా ప్రధాని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.