
ఖిలా వరంగల్( మామునూరు), వెలుగు: వరంగల్ సిటీలోని మామునూరు ఎయిర్ పోర్ట్‌పై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు క్రెడిట్ కోసం ఘర్షణకు దిగారు. శనివారం ఎయిర్ పోర్ట్ వద్ద టెంట్ వేసి ప్రధాని మోదీ ఫ్లెక్సీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ నాయకులు అక్కడికి వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా రావడంతో ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న మామునూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు.
వరంగల్ ప్రజల చిరకాల స్వప్నాన్ని ప్రధాని మోదీ నెరవేర్చారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రెండో రాజధానిగా పిలుచుకునే వరంగల్‌కు కోచ్ఫ్యాక్టరీతో పాటు ఎయిర్ పోర్ట్ ఇవ్వడంతో ఉన్నతశ్రేణి నగరంగా మారుతుందన్నారు. ఎయిర్ పోర్టు వచ్చేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, కొలను సంతోష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండటి శ్రీధర్, రాజేశ్వర్ రావు, ఆరూరి రమేశ్ పాల్గొన్నారు.