
బషీర్బాగ్, వెలుగు: వరంగల్ లో నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ఆ విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రొఫెసర్ కంచె ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజు, రాణిల కాలం చెల్లిందని, తెలంగాణ అస్తిత్వానికి తొలి అమరుడు కొమురయ్య పేరు పెడితే ఆయన ఖ్యాతి ప్రపంచానికి తెలుస్తుందన్నారు.
కొమురయ్య జయంతిని ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం పట్ల జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కురుమలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కురుమ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కురుమ యువకులకు ప్రత్యేక స్థానం కల్పించాలని కోరారు. ఉత్సవ కమిటీ నాయకులు మంగ వెంకట్, సత్యనారాయణ, ప్రొఫెసర్ ఏలేందర్, కమలాకర్, దొడ్డి చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.