న్యూఢిల్లీ: తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామని.. వరంగల్‌లో ఎయిర్ పోర్టును 100 శాతం పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. మంగళవారం (నవంబర్ 26) కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టుల గురించి ఇరువురు చర్చించారు. అనంతరం రామ్మెహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌తో పాటు మూడు ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలని కోరారని తెలిపారు.
వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు అదనంగా కొత్తగూడెం దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు అనువైన స్థలం ఉందని సీఎం చెప్పారని.. స్థల పరిశీలన కోసం త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామన్నారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజబిలిటి స్టడీ చేయాల్సి ఉందని.. నివేదిక సానుకూలంగా వస్తే భూసేకరణకు వెళ్లొచ్చని స్పష్టం చేశారు.
ALSO READ | ఇప్పటికే 61 పర్సెంట్ ఖతం.. ఇక మిగిలింది 39 శాతమే: హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయడానికి రక్షణ శాఖ అంక్షలు ఉన్నాయని.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో చర్చిస్తారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామన్న మంత్రి.. ఎయిర్ పోర్టుల ద్వారా ఉపాధి లభిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు.