గుట్కాపై నజర్..​ బీదర్ నుంచి విచ్చలవిడిగా పొగాకు ప్రొడక్ట్స్ రవాణా

  • వరంగల్ కేంద్రంగా చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా
  • ఏడాదిలో 433 కేసులు, 459 మంది అరెస్టు
  • కేసులు పెడుతున్నా మారని అక్రమార్కుల తీరు
  • పీడీ యాక్టులు మరిచిన పోలీసులు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరం గుట్కా అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. కర్నాటకలోని బీదర్ తోపాటు మహారాష్ట్ర నుంచి గుట్కా, ఇతర పొగాకు ప్రొడక్ట్స్ తీసుకురావడం, సిటీలోని గోదాముల్లో డంప్ చేసి ఇతర ప్రాంతాలకు చేరవేయడం కామనైపోయింది. క్యాన్సర్లకు కారణమవుతున్న ఈ పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వ నిషేధం ఉన్నా పట్టించుకోకుండా విచ్చలవిడిగా దందా చేస్తుండగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. 

ఏడాది కాలంలో 400కు పైగా కేసులు నమోదు చేశారు. అయినా కొంతమంది పట్టించుకోకుండా గుట్కా దందా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుట్కా దందాకు పాల్పడుతున్న వ్యక్తులపై పీడీయాక్టులు నమోదు చేయాలని, టొబాకో ప్రొడక్ట్స్ ను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

బీదర్ టు వరంగల్..

కర్నాటకలోని బీదర్ నుంచి వరంగల్ నగరానికి గుట్కా రవాణా ఎక్కువగా జరుగుతోంది. అక్కడ గుట్కా నిషేధం లేకపోవడంతో కొందరు వ్యాపారులు ఆఫీసర్లను మేనేజ్ చేసుకుంటూ గుట్టలుగా గుట్కా, అంబర్ తదితర పొగాకు ప్రొడక్ట్స్ తెప్పిస్తున్నారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా అక్రమంగా సప్లై అవుతుండగా, ఇక్కడి వ్యాపారులు వరంగల్ లోని పిన్నవారి స్ట్రీట్, బీట్ బజార్, శివనగర్, టైలర్ స్ట్రీట్, ఏనుమాముల తదితర ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని బిజినెస్ నడిపిస్తున్నారు. 

ఈ గుట్కా కాటన్లలో 50 ప్యాకెట్లు ఉండే ఒక్కో బాక్స్ హోల్ సేల్ ధర రూ.300 వరకు ఉండగా, వాటిని రిటైల్ గా రూ.15 నుంచి రూ.18 వరకు పెంచి అమ్ముతున్నారు. ఇలా నెలకు రూ.ఐదారు కోట్ల వరకు గుట్కా, అంబర్, ఇతర పాన్ మసాలాల దందా నడుస్తుంటుందని వ్యాపారులే చెబుతున్నారు. ట్రై సిటీలోని పాన్ డబ్బాలు, కిరాణ షాపులు, ఇతర దుకాణాల్లో గుట్కా, అంబర్, ఇతర తంబాకు ప్యాకెట్లు విచ్చలవిడిగా లభ్యమవుతుండటమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.

పీడీ యాక్టుల్లేవ్..

ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన కొంతమంది వ్యాపారులు స్థానిక ఆఫీసర్లను మేనేజ్ చేసుకుని గుట్కా దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టుకున్నా పిన్నవారిస్ట్రీట్, టైలర్ స్ట్రీట్ లో కొందరు వ్యాపారులు మళ్లీ అదే దందా సాగుతున్నట్లు సమాచారం. సీరియస్ యాక్షన్, పీడీ యాక్టులు లేకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే గుట్కా, అంబర్, ఇతర పొగాకు ప్రొడక్ట్స్ వల్ల ఎంతోమంది క్యాన్సర్ల బారిన పడుతుండగా, ఇకనైనా ఈ దందా చేస్తున్నా వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి గుట్కా నిషేధాన్ని అమలు చేయాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పట్టుకున్నా తీరు మారలే.. 

వరంగల్ ట్రై సిటీతోపాటు కమిషనరేట్ లో గుట్కా, అంబర్, ఇతర పొగాకు ప్రొడక్ట్స్ దందా జోరుగా నడుస్తుండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొద్దిరోజులుగా షాపులు, గుట్కా నిల్వ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో స్థానిక పోలీసుల సహాయంతో మొత్తంగా 433 కేసులు నమోదు చేసి, 459 మందిని అరెస్ట్ చేశారు. 

ఓవరాల్ గా రూ.3 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తులు పట్టుకున్నారు. కాగా టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు పట్టుకుని నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తుండటంతో కొంతమంది మళ్లీ అదే దందాను కొనసాగిస్తున్నారు.