హనుమకొండలో బీఆర్ఎస్ – బీజేపీ ఫైటింగ్ : రాళ్లదాడుల్లో ఇద్దరికి గాయాలు

వరంగల్ లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డబుల్ ఇండ్ల కోసం బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ... ఆగస్టు 24వ తేదీ  బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇండ్ల ముట్టడికి పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. దీంతో ఉదయమే హనుమకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. సమస్యలపై ప్రశ్నిస్తే.... అడ్డుకుంటున్నారని, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుంటే... అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు.

 హనుమకొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బీజేపీ లీడర్లను అడ్డుకున్నారు. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు గాయాలు కావడంతో రక్తస్రావం అయింది.   

మరోవైపు పోలీసుల తీరుకు నిరసనగా హనుమకొండలో రోడ్డుపై బైఠాయించారు బీజేపీ నేత రాకేశ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే.... పోలీసులు తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు రాకేశ్ రెడ్డి. రోడ్డుపై ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.