వరంగల్, వెలుగు: తండ్రి కూతుళ్లు ఇద్దరూ తనపై వ్యక్తిగత కామెంట్లు చేస్తున్నారని, మరోసారి వ్యక్తిగత విమర్శలు చేస్తే కడియం నీ జాతకమంతా బయటపెడతానని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ హెచ్చరించారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్హంటర్రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరి తన కూతురు కావ్యకు బీఆర్‍ఎస్ ఎంపీ టికెట్ తెచ్చుకున్న క్రమంలో ఎన్నికల ఖర్చు పేరుతో పార్టీ నుంచి పైసలు తెచ్చుకుని, రాత్రికిరాత్రే కాంగ్రెస్‍లో చేరాడని ఆరోపించారు. ఏ వ్యాపారం చేయకుండా పదేళ్ల కాలంలో ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో కడియం చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ హనుమకొండ, వరంగల్ అధ్యక్షులు రావు పద్మ, గంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో పలువురి చేరిక
వర్థన్నపేట (ఐనవోలు) : ఎన్నికల వేళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఐనవోలు మండలంలోని నర్సింహులగూడెం, పెరుమాండ్లగూడెంకు చెందిన మాజీ సర్పంచులు కట్కూరి సునీతా కుమార్, పిడుగు రజితతో పాటు నందనం, ఒంటిమామిడిపల్లి, ఐనవోలు, కక్కిరాలపల్లి గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. వర్థ న్నపేట మున్సిపాలిటీ, గ్రామీణ నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, మున్నూరు కాపు సంఘం నాయకులు వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్రాధ్యక్షుడు కొండేటి శ్రీధర్, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీజేపీ నాయకులు గజ్జెల శ్రీరాములు, కేశవ రెడ్డి, గాడిపల్లి రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.