వరంగల్ కుర్రాడు: ఇంటర్నేషనల్ మాస్టర్

  • చదరంగంలో దూసుకెళ్తున్న జీవితేశ్‌
  • ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదా కైవసం
  • గ్రాండ్‌మాస్టర్‌పై గురిపెట్టిన యువ ప్లేయర్‌

warangal boy sai agni jeevitesh achieves international master titleహైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి మరో యువ చెస్‌ ప్లేయర్‌ గ్రాండ్‌ మాస్టర్‌ దిశగా దూసుకెళ్తున్నాడు. వరంగల్‌కు చెందిన జొన్నలగడ్డ సాయి అగ్ని జీవితేశ్‌..  ఇంటర్నేషనల్‌  మాస్టర్‌ (ఐఎమ్‌) హోదా దక్కించుకున్నాడు. గ్రాండ్‌మాస్టర్‌పై గురి పెట్టి కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న 20 ఏళ్ల జీవితేశ్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. చాలా కాలంగా తనను ఊరిస్తున్న ఐఎం హోదాను జీవితేశ్‌ ఎట్టకేలకు అందుకున్నాడు. గతంలోనే 2400 ఎలో రేటింగ్‌ పాయింట్లు దక్కించుకున్న సాయి.. సెర్బియాలోని నోవిసాడ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో తొమ్మిది రౌండ్లకు గాను ఏడు పాయింట్లు దక్కించుకొని మూడో నార్మ్‌ అందుకున్నాడు.

అంతకు ముందు నోవిసాడ్‌లో జరిగిన రౌండ్‌ రాబిన్‌ టోర్నీలో తొలి, ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఏసియన్‌ చాంపియన్‌షిప్‌లో రెండో నార్మ్‌ దక్కించుకున్న జీవితేశ్‌ రాష్ట్రం నుంచి తాజా ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా నిలిచాడు. అయితే, ఐఎమ్‌ కు కావాల్సిన మూడు నార్మ్‌ల్లో రెండింటిని వెంటవెంటనే సాధిం చినప్పటికీ.. మూడోదాని కోసం జీవితేశ్‌ ఎనిమిది నెలలు  నిరీక్షించాల్సి వచ్చింది. కాస్త ఆలస్యంగా అయినా ఐఎం హోదా దక్కించుకోవడం చాలా అనందంగా ఉందని సాయి తెలిపాడు. ఇప్పుడు తాను చాలా రిలీఫ్‌గా ఫీలవుతున్నట్లు చెప్పాడు.

జీఎం టైటిల్‌పైనే దృష్టి..

ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించాలనే తన లక్ష్యం నెరవేరిందన్న జీవితేశ్‌  ఇక తన దృష్టంతా గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కించుకోవడంపైనే అని అంటున్నాడు.  చెస్‌ లెజెండ్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ను ఆరాధించే సాయి  ప్రస్తుతం 2325 ఫిడే ర్యాంకింగ్‌ పాయింట్లతో ఉన్నాడు. 2017 ఫిబ్రవరిలో కెరీర్‌ ఉత్తమంగా 2404 పాయింట్ మార్కును టచ్‌ చేశాడు. తాను 2500 పాయింట్‌ మార్కును చేరుకుంటే జీఎం టైటిల్‌ను అందుకోగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఐఎం హోదాతో ఇకపై టైటిల్‌తో మేజర్‌ టోర్నీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇండియాలో జరిగే టోర్నీల్లో ఫ్రీ ఎంట్రీ లభిస్తుంది. వసతికి కూడా ఇబ్బంది ఉండదు. దాంతో, మా తల్లిదండ్రులపై భారం కూడా తగ్గుతుంది. అప్పుడు నేను పూర్తిగా ఆటపైనే దృష్టి సారించొచ్చు జీవితేశ్‌ తెలిపాడు.