మహబూబీకి  జాగ తిరిగిచ్చిన్రు

  • విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన బీఆర్​ఎస్​ లీడర్లు
  • పార్టీ పెద్దల సూచనతో  గద్దె కూల్చి ప్లాట్‍ అప్పజెప్పిన్రు

వరంగల్‍/వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధి దేశాయిపేట మోటూరి హనుమంతరావు నగర్‍లో మహబూబీ ఇంటిలో అక్రమంగా బీఆర్‍ఎస్‍ గద్దె కట్టిన పార్టీ లీడర్లు వెనక్కితగ్గి  జాగను ఆమెకు అప్పగించారు. నాలుగు రోజుల కింద అధికార పార్టీ నేతలు నిరుపేద మహిళ మహబూబీ రేకుల ఇల్లును కూల్చి ఆ స్థలంలో బీఆర్ఎస్ గద్దె కట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి నిరసన తెలిపింది. వీరికి బీజేపీ లీడర్లు మద్దతు తెలిపారు. మహబూబీకి జరిగిన అన్యాయాన్ని 'నిరుపేద ఇంటిని కూల్చి.. బీఆర్‍ఎస్‍ జెండా గద్దె' పేరుతో ఆదివారం ‘వెలుగు’ పేపర్​ మెయిన్‍ లో కథనం ప్రచురించింది. 

దీనికి ముందురోజే మున్సిపల్ మంత్రి కేటీఆర్  సిటీలో పర్యటించడం.. నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పడం.. దీనికి భిన్నంగా బీఆర్‍ఎస్‍ నేతలు మహిళ ఇంటిని కూల్చి పార్టీ గద్దె కట్టిన సమాచారాన్ని వార్తలో ప్రస్తావించింది. దీంతో ఇష్యూ పార్టీ పెద్దలకు చేరింది. లోకల్​ నేతలు, కార్పొరేటర్ సురేశ్​ జోషి తీరుపై విమర్శలు వచ్చాయి.  దీంతో దిగొచ్చిన కార్పొరేటర్‍ మంగళవారం మహబూబీ ఇంటి స్థలంలో జెండా గద్దె తొలగించి ప్లాట్​ ఆమెకు అప్పగించారు. ఇంటి నిర్మాణానికి సైతం సహకారం అందిస్తామని కార్పొరేటర్​ చెప్పినట్లు మహబూబీ తెలిపింది.