
- రాష్ట్రం నుంచి మొదటి ఉద్యానవన ఉత్పత్తిగా గుర్తింపు
- దుగ్గొండి మండలం తిమ్మంపేట్ చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి దక్కిన ఘనత
- కొండా లక్ష్మన్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి 2022లో దాఖలు
వరంగల్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన చపాటా మిర్చి రకానికి మరింత క్రేజ్ వచ్చింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ట్యాగ్ లభించింది. రాష్ట్రం నుంచి మొదటి ఉద్యానవన ఉత్పత్తిగా దేశ జీఐ రిజిస్ట్రీ ప్రభుత్వం నుంచి రిజిస్ట్రేషన్ ట్యాగ్ పొందింది. దేశంలో కేవలం వరంగల్ కేంద్రంగా పండించే చపాటా రకం మిర్చికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట్ చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‍తో పాటు ఇక్కడి రైతు జెన్నారెడ్డి వెంకట్‍రెడ్డి (జేవీఆర్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్) పేరుతో కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరుతో 2022లో దాఖలు చేయగా, దీనికి జీఐ ట్యాగింగ్ లభించింది. యూనివర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు కిలో రూ.300 మార్కెట్ ధర ఉన్న మిర్చి జీఐ గుర్తింపు తర్వాత రూ.450 నుంచి రూ.500 లకు పెరిగే అవకాశం ఉంది.
చపాటా కేరాఫ్ వరంగల్..
చపాటా మిర్చికి కేరాఫ్ వరంగల్ జిల్లానే చెబుతారు. దాదాపు 80 ఏండ్లనుంచే వరంగల్‍తో పాటు చుట్టుపక్క ఏరియాల్లో ఈ రకం మిర్చి సాగు చేసినట్లు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. స్థానికంగా 'టమాట రకం మిరపకాయ' అని పిలిచే మిర్చి ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో కలిపి 6,738 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులోనూ డబుల్ పట్టీ, సింగిల్ పట్టీ, ఓడలు పేరుతో మూడు రకాల చపాటా పంట ఉంది. ఒలియోరెసిన్ కంటెంట్ (మిరప నుంచి తీసే నూనె) గా 6.37 శాతం నుంచి 6.75 శాతం వరకు ఉండి ఘాటు తక్కువగా ఉంటుంది.
ఇంటర్నేషనల్ స్థాయిలో డిమాండ్..
చపాటా రకం మిర్చికి ప్రపంచస్థాయిలో మార్కెట్ డిమాండ్ ఉంది. యూఎస్‍ఏ, చైనా, యూకే, జర్మనీ, యూరోపియన్ దేశాల్లో దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. ఈ మిర్చి ఘాటు (కాప్సైసిన్ శాతం 0.02 శాతం నుంచి 0.04) తక్కువగా ఉండటంతో ప్రధానంగా రుబ్బిన మసాలా, తాజా పండిన మిర్చి అయితే ఊరగాయల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మిర్చి నుంచి తీసిన నూనె (ఒలియోరెసిన్) ఇంటర్నేషనల్ ఫుడ్స్తోపాటు ఖరీదైన స్వీట్లు, కాస్మోటిక్స్, వివిధ రకాల డ్రింక్స్, మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం జీఐ ట్యాంగింగ్‍తో చపాటా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నది.