వరుస వానలకు ఓరుగల్లులో బయటపడ్డ ఆక్రమణలు

  • చెరువులు నిండినయ్..వెంచర్లు మునిగినయ్!
  • వరుస వానలకు ఓరుగల్లులో బయటపడ్డ ఆక్రమణలు

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లులో ఇటీవల కురిసిన భారీ వానలు చెరువుల ఆక్రమణలను బయటపెట్టాయి. పైనుంచి వచ్చిన వరదతో చెరువులు, కుంటలన్నీ నిండిపోయాయి. ఫుల్​ ట్యాంక్​  లెవల్ ​వరకు నీళ్లు చేరడంతో శిఖం భూములు, బఫర్​ జోన్లలో ఏర్పాటు చేసిన  వెంచర్లన్నీ నీటిలో మునిగాయి.  ఓరుగల్లు నగరంలో కాకతీయులు నిర్మించిన చెరువులు, కుంటలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. రియల్టర్లు, బిల్డర్లు  చెరువుల గొలుసుకట్టు తెంపేసి బిల్డింగులు, వెంచర్లు చేసి అమ్మేస్తున్నారు. ఎప్పటినుంచో ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవలి వానలకు నిండుకుండల్లా మారిన చెరువులు, కుంటలు ఆఫీసర్ల అలసత్వాన్ని కండ్లకు కడుతున్నాయి. అక్రమార్కులు కబ్జా చేసి ఏర్పాటు చేసిన వెంచర్లు, ప్లాట్లు చెరువులు, కుంటల మధ్యలో తేలాడుతున్నాయి. వాస్తవానికి ఎప్పటినుంచో వరంగల్​నగర పరిధిలోని చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని లీడర్లు, ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ.. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. 

చెరువుల మధ్యలో వెంచర్లు

చెరువులు, కుంటల్లో ఇష్టారీతిన వెంచర్ల ఏర్పాటవడానికి కాకతీయ​అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీ(కుడా) ఆఫీసర్ల అవినీతి కూడా కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కొందరు ఆఫీసర్లు కాసులకు కక్కుర్తి పడి చెరువుల్లో వెంచర్ల ఏర్పాటుకు  పర్మిషన్లు ఇచ్చారనే ఫిర్యాదులున్నాయి. ఇదే చెరువులు మాయం కావడానికి ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే కొంత మంది పట్టా భూముల సాకు చెబుతూ చెరువులు, కుంటల్లోనే ఇష్టమొచ్చినట్లు వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల బిజినెస్​ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆ విషయాన్ని  ఎవరూ పట్టించుకోలేదు.  ఇప్పుడు చెరువులు నిండడంతో ఆక్రమణలు కళ్లకు కట్టినట్లయింది. వాస్తవానికి చెరువుల్లో వెలిసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్స్​ ​ జరగకుండా ప్రొహిబిటెడ్​లిస్ట్​ లో చేర్చాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకునే నాథులే కనిపించడం లేదు. 

కొరవడిన చర్యలు

2020లో వచ్చిన వరదల తరువాత చెరువుల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సర్వే చేసి జీడబ్ల్యూఎంసీ పరిధిలో 282 చెరువులు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. కానీ వాటి సంరక్షణ కోసం కనీస చర్యలు చేపట్టడం లేదు.  గతంలో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువులు, కుంటలు ఇప్పుడు ఎంతమేర మిగిలి ఉన్నాయో కూడా ఆఫీసర్లకు తెలియని పరిస్థితి నెలకొంది. వరంగల్​భద్రకాళి చెరువు 300 పైగా ఎకరాలు, మట్టేవాడ కోట చెరువు 159 ఎకరాలు, చిన్నవడ్డెపల్లి చెరువు 100 ఎకరాలు, ఉర్సు రంగసముద్రం చెరువు  126 ఎకరాలు, ఏనుమాముల కోట 39 ఎకరాల 2 గుంటలు,  ఏనుమాముల సాయి చెరువు 11 ఎకరాల 37 గుంటలు, రంగశాయిపేట బెస్తం చెరువు 241 ఎకరాల 17 గుంటలు, గోపాలపూర్​ఊర చెరువు 20 ఎకరాలు ఉండాలి. కానీ  చుట్టూ పుట్టుకొచ్చిన ఆక్రమణలతో ఇప్పుడు ఎంత మిగిలాయో కూడా తెలియని పరిస్థితి. చెరువు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్, హనుమకొండ కలెక్టర్లు, ఇరిగేషన్​, గ్రేటర్ ఆఫీసర్లు, ఎన్​ఐటీ ప్రొఫెసర్లు పలుసార్లు సమావేశమయ్యారు. చెరువులను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. ఫలితంగా ఎక్కడికక్కడ చెరువులు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. కాకతీయులు నిర్మించిన చెరువులు పూర్తిగా కనుమరుగు కాకముందే యాక్షన్​ తీసుకోవాల్సిన ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా లీడర్లు, ఆఫీసర్లు మేల్కొని చెరువులు, కుంటల పరిరక్షణకు కృషి చేయడంతో పాటు ఎఫ్​టీఎల్, బఫర్​జోన్లలో నిర్మాణాలు జరగకుండా యాక్షన్​ తీసుకోవాలని గ్రేటర్​ ప్రజలు కోరుతున్నారు.  

42 చెరువుల్లో ఇండ్లు..

కాకతీయుల పాలనలో వ్యవసాయానికి అనుకూలంగా ఉండేందుకు చెరువులు, కాల్వలు, బావుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఓరుగల్లు నగరం చుట్టూరా గొలుసుకట్టు విధానంలో దాదాపు 300 చెరువులు, కుంటలు ఏర్పాటు చేశారు. కానీ వరంగల్ అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో చాలామంది రియల్టర్, బిల్డర్ల అవతారం ఎత్తి ల్యాండ్​ బిజినెస్ మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు ఆక్రమించి వెంచర్లు చేశారు. బిల్డర్లు చెరువుల్లోనే ఇండ్లు కట్టి అమ్మేశారు.  2020 ఆగస్టులో వరంగల్ నగరాన్ని  వరదలు ముంచెత్తగా.. చెరువుల గొలుసుకట్టు తెగిపోవడం, కాల్వల కబ్జాలే ఈ పరిస్థితికి కారణమని ఆఫీసర్లు, నిపుణులు రిపోర్ట్ తయారు చేశారు. అనంతరం ఇరిగేషన్​ఎక్స్ పర్ట్స్, పరిశోధకుల అధ్యయనంలో నగరం చుట్టూరా ఉన్న 42 చెరువుల్లో ఇండ్లు కట్టడం వల్ల చెరువులు  పూర్తిగా కనుమరుగైనట్లు తేల్చారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు ఒక్కొక్కటిగా మాయం అవుతున్నా లీడర్లు, ఆఫీసర్లు ఏ మాత్రం పట్టింపులేకుండా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.