
- వరంగల్లో ఒక్కో ఇంటికి రూ.50వేల దాకా నష్టం
- నీటమునిగిన టీవీలు, కూలర్లు, ఫ్రిజ్‍లు
- రిపేర్ల కోసం మెకానిక్ షాపులకు బండ్లు
- ఇంటికి రూ.25 వేల పరిహారం ఇయ్యాలంటున్న పబ్లిక్, ప్రతిపక్షాలు
వరంగల్, వెలుగు: భారీ వర్షాలు, వరదలకు నీటమునిగిన వరంగల్ కాలనీల్లో నష్టం ఊహకు అందడం లేదు. జీడబ్ల్యూఎంసీ లెక్కల ప్రకారమే ట్రైసిటీలో154 కాలనీల్లోకి నడుంలోతు వరద చేరింది. జనం కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లి వచ్చేసరికి ఇండ్లలోని వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయి. టూవీలర్లు, కార్లు, ఆటోలతోపాటు మంచాలు, సోఫాలు, టీవీలు, కూలర్లు, ఫ్రిజ్‌ల లాంటి విలువైన ఎలక్ట్రిక్ సామగ్రి ఖరాబయ్యాయి. ఒక్కొక్కరు రూ.30వేల నుంచి 50 వేల వరకు లాస్ అయ్యారు. కానీ సర్కారు మాత్రం బట్టలు, బియ్యం, ఉప్పులు, పప్పులకు లెక్క కట్టి ఇంటికి రూ.3,800 చొప్పున ఇస్తామని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి.
ఏ ఇల్లు చూసినా బురదే
గత సోమవారం నుంచి గురువారం వరకు కురిసిన వర్షాలకు వరంగల్ సిటీలోని 154 కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ తూర్పున ఆరు, హనుమకొండలో 12 ఏరియాలు పూర్తిగా నీటమునిగాయని ఆఫీసర్లు ప్రకటించారు. కాలనీల్లో మొత్తం నీళ్లు చేరడంతో తాళాలేసి పునరావాస కేంద్రాలు, బంధువుల ఇండ్లకు వెళ్లారు. వానలు, వరదలు తగ్గాక శుక్ర, శనివారాల్లో వచ్చి చూస్తే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బియ్యం బస్తాలు, ఉప్పుపప్పులు, బట్టలు, బీరువాల్లోని ఖరీదైన చీరలు, బెడ్లు, పరుపులు, టీవీలు, కూలర్లు, ఫ్రిజ్‍లు.. ఇలా ప్రతి ఒక్కటి నాని పనికిరాకుండా పోయాయి. చాలా ఇండ్లల్లో కరెంట్ స్విచ్ బోర్డుల్లోకి కూడా బురద చేరింది. కాలనీలకు ఆరేడు ఫీట్ల ఎత్తులో వరద చేరడంతో బైకులు, కార్లు నాశనమయ్యాయి. మరికొన్ని కొట్టుకుపోయాయి. దీంతో బాధితులు వాహనాలను రిపేర్లకు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా ప్రతి ఇంటా రూ.50 వేలకు పైగానే నష్టం జరిగింది. ఇక నయీంనగర్‍లో చిరువ్యాపారులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. విద్యాసంస్థల కేంద్రంగా ఉన్న ఇక్కడ పెద్దసంఖ్యలో హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు ఉండగా, వరద దెబ్బకు సామాన్లన్నీ కొట్టుకుపోయాయి.
బట్టలకు రూ.1800.. వస్తువులకు రూ.2 వేలట!
వానలు, వరదలు ఆగి వారమవుతోన్నా రాష్ట్ర సర్కా రు ఇప్పటికీ వరద పరిహారం ప్రకటించలేదు. శని వారం వరంగల్లో మంత్రి ఎర్రబెల్లి, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో నిర్వహించిన రివ్యూలో మాట్లాడుతూ.. వరదల కారణంగా బట్టలు పాడైన వారికి రూ.1800, ఇంట్లోని అన్ని వస్తువులకు కలిపి మరో రూ.2 వేల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇండ్లు కూలిపోతే రూ.95 వేలు, పాక్షికంగా దెబ్బతింటే రూ.3,200 నుంచి రూ.5 వేలు, గుడిసెలు దెబ్బతింటే రూ.4,100 ఇస్తామన్నారు. మూడేండ్ల కింద హైదరాబాద్ లో వరదలు రాగా రూ.10 వేల చొప్పున సాయమందించారు. ఇప్పుడు మాత్రం 3,4 వేల ముచ్చటే చెప్తుండడంపై జనం మండిపడ్తున్నారు. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కో బాధిత కుటుంబానికి కనీసం రూ.25 వేల చొప్పున అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
వరద నష్టం రూ.70 వేలు
గురువారం మధ్యాహ్నం కేవలం 40 నిమిషాల వ్యవధిలో మా ఇండ్లలోకి నడుంలోతు వరదొచ్చింది. ప్రాణాలు పోయేట్టు ఉండడంతో తాళాలు వేసి వెళ్లినం. శనివారం ఇంటికొచ్చిచూస్తే ఒక్కటంటే ఒక్క వస్తువు పనికి వచ్చేలా కనిపించలేదు. బట్టలు, మంచం, దిండ్లు, టీవీ, ఫ్రిజ్, కూలర్, బియ్యం బస్తాలు, ఇంటిముందు పెట్టిన బైక్ బురద పట్టినయ్. బీరువా లోపలకు కూడా బురద నీరు చేరింది. రూ.70 వేల వరకు లాస్ అయినం.
- రాజయ్య, నయీంనగర్
లక్షల రూపాయల కంప్యూటర్లు పాడైనయ్
కిషన్‍పురలో కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్ నడుపుతున్నా. స్టూడెంట్లకు కొత్త కంప్యూటర్లు, ల్యాప్‍టాప్‍లు, సీపీయూలు, ప్రింటర్లు అమ్ముతా. వరదల ఎఫెక్ట్‌తో షాపు నడిపే గదిలోకి పూర్తిగా నీళ్లు చేరాయి. ఒక్కటంటే ఒక్క కంప్యూటర్ కూడా పనికి వచ్చేలా లేదు. ఏం చేయాలో కూడా అర్ధం కావట్లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
- సాయి, నయీంనగర్, హనుమకొండ