వింత కాలం .. వరంగల్ సిటిని కప్పేసిన మంచు దుప్పటి

వింత కాలం .. వరంగల్ సిటిని కప్పేసిన మంచు దుప్పటి
  • ఓరుగల్లులో రాత్రయితే దుప్పట్లు కప్పుకునేలా చలి 
  • పొద్దున్నే పల్లె, పట్నమంతటా దట్టమైన పొగమంచు 
  • నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి 
  • రోడ్లపై ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

వరంగల్‍/ కాశీబుగ్గ, వెలుగు: ఓరుగల్లును దట్టమైన మంచు దుప్పటి కమ్మేసి ఊటీని తలపిస్తోంది.మండు వేసవిలో వింత వాతావరణంతో జిల్లా వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పగలంతా భగ్గుమనేలా ఎండలు కొడుతున్నా, రాత్రయిందంటే చాలు దుప్పట్లు కప్పుకునే స్థాయిలో తీవ్ర చలి పెడుతోంది. తెల్లవారుజాము మొదలు ఉదయం ఎనిమిది, తొమ్మిదైనా సూర్యుడు కనిపించని స్థాయిలో పల్లె, పట్టణమనే తేడా లేకుండా నాలుగైదు రోజులుగా దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఈఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు దంచికొట్టాయి. శివరాత్రి రోజు గతంలో చలి ఉండగా, ఈసారి పండుగ అర్థరాత్రి సైతం ఉక్కపోతలు తప్పలేదు. ఈ నాలుగైదు రోజులుగా అనూహ్యంగా టెంపరేచర్లు పడిపోయి ఉదయం ఊటీని తలపిస్తోంది. రాష్ట్రంలో, చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడా తుఫాన్లు లేనప్పటికీ వాతావారణంలో మార్పులు జరగడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు.

పొగమంచుతో రోడ్లు కనపడట్లే..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో పల్లె, పట్టణాలకు వెళ్లే రోడ్లతో పాటు ఖమ్మం, చత్తీస్‍గఢ్‍, హైదరాబాద్‍, కరీంనగర్​ హైవేలు మంచుతో నిండిపోతున్నాయి. పలుచోట్ల ఉదయం 10 గంటల వరకు రోడ్లపై మంచుపొగలు అటుఇటుగా కదులుతున్నాయి. కార్లు, పెద్ద వాహనదారులు లైట్లు వేసుకున్నా 100 అడుగులకు మించి రోడ్లు కనిపించడంలేదు. 

దీంతో తెల్లవారుజామునే జిల్లా కేంద్రాల్లోని మార్కెట్లకు వెళ్లే రైతులు, జిల్లాలు దాటి వెళ్లే ట్రాన్స్​పోర్ట్ లారీల డ్రైవర్లు ప్రయాణంలో తీవ్ర  ఇబ్బందులు పడ్తున్నారు. పొగ మంచు తగ్గేవరకు చేతులు అరచేతిలో పెట్టుకుని జర్నీ చేస్తున్నారు. ఇదంతా ఒకవైపు కాగా, జనాలు మాత్రం ఎండాకాలంలో భగ్గుమనే ఎండలు, ఉక్కపోతలు లేకుండా ఊటీ తరహా వాతావరణాన్ని ఎంజాయ్‍ చేస్తున్నారు.