- అఫీషియల్ వెబ్ సైట్ హ్యాక్ చేసి అప్లోడ్
- అమ్మిన ఆరుగురు.. కొన్న మరో ఆరుగురు అరెస్ట్
- పరారీలో మరో ముగ్గురు నిందితులు
- 88 సర్టిఫికెట్లు, రూ.5.37 లక్షలు స్వాధీనం
హనుమకొండ, వెలుగు: దేశంలోని వివిధ యూనివర్సిటీల పేరుతో ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి, అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో పెట్టి సొమ్ము చేసుకుంటున్న ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్, హసన్‌పర్తి పోలీసులు పట్టుకున్నారు. లక్ష రూపాయలిస్తే డిగ్రీ, లక్షన్నర ముట్టజెప్తే ఫేక్ ఇంజినీరింగ్ పట్టా తయారు చేసి ఇచ్చేవారు. ముఠాలోని ఆరుగురితో పాటు నకిలీ సర్టిఫికెట్లు కొన్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా.. పట్టుబడిన వారి నుంచి రూ.5.37 లక్షల నగదు, 88 నకిలీ సర్టిఫికెట్లు, నాలుగు స్టాంప్స్, 16 సెల్ఫోన్లు, ప్రింటర్, సీపీయూ స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్లూ నకిలీ సర్టిఫికెట్ల తయారీ వరకే ఉన్న దందా కాస్తా.. యూనివర్సిటీల అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో చొరబడి అప్లోడ్ చేసే దాకా రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి బుధవారం వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆకుల రవి అలియాస్ అవినాశ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లంకల శంకర్రావు, హనుమకొండకు చెందిన మీరా అక్తర్ అలీ బేగ్, హైదరాబాద్‌కు చెందిన సుడిగ ఎల్లేశ్, ముప్పూరి పురుషోత్తం, కామన ప్రీతమ్ ఈజీ మనీ కోసం ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసే దందాకు తెరలేపారు.
అఫీషియల్ వెబ్ సైట్ హ్యాక్ చేసి..
ఈ గ్యాంగ్ ఫేక్ సర్టిఫికెట్లు పొందిన వ్యక్తుల వివరాలను సంబంధిత వర్సిటీ అఫీషియల్ వెబ్ సైట్‌ను హ్యాక్ చేసి అందులో ఎంటర్ చేయించేవారు. ఈ పనంతా ఇదివరకే వీరికి పరిచయమున్న యూపీకి చెందిన సర్వేశ్ సహాయంతో చేశారు. ఇలా కాకతీయ యూనివర్సిటీ, ఆంధ్రా, నాగార్జున, శ్రీ వేంకటేశ్వర దేవర్య, అన్నం, ఢిల్లీ వర్సిటీలతో పాటు తెలంగాణ, ఏపీలకు చెందిన ఇంటర్మీడియట్ బోర్డు, ఓపెన్‌స్కూల్ కు సంబంధించిన సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. ఇలా ఇప్పటిదాకా దాదాపు 665కి పైగా వివిధ విద్యార్హతలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి అమ్మారు. వీరి నుంచి ఫేక్సర్టిఫికెట్లు పొందిన127 మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించగా.. మిగతా వారి కూపీ లాగుతున్నారు. ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ డా.ఎం.జితేందర్‌రెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, నరేశ్‌కుమార్, హసన్‌పర్తి సైబర్ క్రైమ్ సీఐలు నరేందర్, జనార్దన్ రెడ్డి, ఎస్సైలు నిస్సార్ పాషా, లవన్ కుమార్, భరత్, ఏఏవో సల్మాన్ పాషా, సిబ్బంది సోమలింగం, మాధవ రెడ్డి, స్వర్ణలతలను సీపీ అభినందించారు.
ఫేక్ సర్టిఫికెట్స్‌తో విదేశాలకు
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవాళ్లకు నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. మూడేండ్ల గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్‌ను రూ.లక్ష, నాలుగేండ్ల ఇంజినీరింగ్, ఆపై చదువులకు సంబంధించిన సర్టిఫికెట్లకు రూ.లక్షన్నర, రూ.2 లక్షలు తీసుకుని ఇచ్చేవారు. ఈ క్రమంలోనే వివిధ సర్టిఫికెట్ల కోసం సికింద్రాబాద్‌కు చెందిన ఐనవోలు సాయి శ్రావణ్, గుంటూరుకు చెందిన కోటా అశోక్, నల్గొండకు చెందిన గండికోట సందీప్, హైదరాబాద్‌కు చెందిన మనోజ్సింగ్, వనపర్తికి చెందిన తల్లూరి సంప్రీత్, చిదురాల లక్ష్మీప్రసాద్ ఈ ముఠాను సంప్రదించారు. వీరికి కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం ముఠాను పట్టుకుని 12 మందిని అరెస్ట్ చేశారు. బట్ట సందీప్, మెండి విజయ్, యూపీకి చెందిన సర్వేశ్ పరారీలో ఉన్నారు.