
వర్ధన్నపేట, వెలుగు: సాగునీటి సమస్య లేకుండా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపటాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఎస్సారెస్పీ ప్రధాన కాల్వను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో నీటి లభ్యతను పరిశీలించారు. ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ ద్వారా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని రావూరు, ధూప తండా, కల్లెడ పర్వతగిరి తదితర గ్రామాల్లోని నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొంటూ రైతుల పంటలు ఎండిపోకుండా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.
అనంతరం వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామం, పర్వతగిరి మండలం చౌటుపల్లిలలోని కర్షక సేవ సహకార సంఘాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎరువుల స్టాక్ రిజిస్టర్లు మందులను, కోపరేటివ్ సొసైటీ రికార్డులు పరిశీలించారు. నల్లబెల్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల ప్యాడ్లు, నోట్ బుక్స్ లను అందించారు.