సఫాయి మిత్రల సేవలు అభినందనీయం : కలెక్టర్ సత్యశారద

సఫాయి మిత్రల సేవలు అభినందనీయం : కలెక్టర్ సత్యశారద

పర్వతగిరి/ కాశీబుగ్గ, వెలుగు: గ్రామాల్లో సఫాయి మిత్రలు బాధ్యతగా పనిచేస్తుంటారని, వారి సేవలు అభినందనీయమని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాంకు కలెక్టర్​హాజరై మహిళా సంఘాల సభ్యులు మ్యాప్, వస్తువుల రూపంలో ఏర్పాటు చేసిన అపరిశుభ్ర ప్రదేశాలు, తడి, పొడి చెత్త ప్రదర్శనలు, ప్లాస్టిక్​ నివారణకు స్టీల్ బ్యాంకు, సెల్ఫీ పాయింట్, సంతకాల సేకరణను పరిశీలించారు. అనంతరం జీపీ ఆఫీస్ ఆవరణలో మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేసే సఫాయిలు చేస్తున్న సేవలకు మనమంతా థ్యాంక్సు చెప్పాలన్నారు. అనంతరం సఫాయి మిత్రలను స్వచ్ఛ సైనికులుగా అభివర్ణిస్తూ వారిని సన్మానించారు. స్వచ్ఛత గురించి స్కూల్ పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులను అందించారు. కాగా, గ్రామంలో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు కలెక్టర్​దృష్టికి తీసుకెళ్లారు. కల్లెడలో ఎస్సారెస్పీ కెనాల్ కాలువను పూడ్చివేసి, ప్లాట్లు చేసి అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు వినతి పత్రం అందించారు.

అనంతరం పర్వతగిరి ఎంపీడీవో ఆఫీస్​లో మిషన్ భగీరథలో పనిచేసే గ్రామీణ తాగునీటి సహాయకులకు సింగిల్ ఫీజ్, ట్రీఫీజ్, విద్యుత్తు పరికరాల మరమ్మతులకు సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాంకు హాజరయ్యారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీపీవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, వరంగల్ కరీమాబాద్​ దసరా ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం కలెక్టర్ సత్య శారదను కలిసి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం అందజేశారు.