నర్సంపేట, వెలుగు : మలేరియా, డెంగ్యూ విష జ్వరాలు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బానోజీపేట పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఫీవర్ సర్వే, మందుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు రోజులుగా జ్వరాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయాలన్నారు.
మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలతో సీరియస్ గా ఉంటే ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. బానోజీపేటలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి, వైద్యంపై రోగులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సంపేట అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ సందర్శించి
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ అరుణ్ చంద్ర, రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేక అధికారి ఇసాక్ అలీ, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.