వర్ధన్నపేట, వెలుగు: తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులు నూతన విధానాలు పాటించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నిర్వహించి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ వరంగల్జిల్లా వర్ధన్నపేట రైతువేదికలో పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు నేరుగా పంట పొలాల వద్దకు వెళ్లి సాగులో ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలనే ఆలోచనతోనే రైతు నేస్తానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టి రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి ప్రతీ మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం పేరిట రైతు వేదికల్లో రాష్ట్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాల్, మండల వ్యవసాయ అధికారి సాగరిక, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.