వర్ధన్నపేట, వెలుగు: మామిడి సాగులో ఆధునిక పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాధించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం వరంగల్జిల్లా వర్దన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలోని రైతు వేదికలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి సమగ్ర యాజమాన్య పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథిగా హాజరై రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
రైతులు మాట్లాడుతూ మామిడి సాగు చేసి కోత కోసిన తర్వాత మార్కెట్‌లో అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మామిడి కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. శాస్త్రవేత్తలు చెప్పినట్లు రైతులు మామిడి సాగు చేసినట్లయితే నాణ్యతతో కూడిన దిగుబడి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు, వర్దన్నపేట ఎమ్మార్వో విజయసాగర్ , వ్యవసాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.