హనుమకొండ, వెలుగు : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి సీపీ అంబర్ కిశోర్ ఝా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది వ్యక్తిగత, డిపార్ట్మెంట్ పరమైన సమస్యలతో బాధపడుతున్నట్లు సీపీ దృష్టికి వెళ్లడంతో వారి సమస్యలు పరిష్కరించేందుకు పోలీస్ కంట్రోల్ రూంలోనే ఈ స్పెషల్ వింగ్ ను ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూంకు చెందిన మహిళా ఏఎస్సై జ్యోతి ప్రియాంకను ఈ వింగ్ కు నోడల్ ఆఫీసర్ గా నియమించారు. ఇక నుంచి పోలీస్ సిబ్బంది ఎవరైనా వ్యక్తిగత లేదా డిపార్ట్మెంట్ పరమైన సమస్యలు ఉంటే వెంటనే నోడల్ ఆఫీసర్ నెంబర్ 99486 85494 కు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చని సీపీ తెలిపారు. ఫిర్యాదులను సమీక్షించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది ఎవరైనా తనను నేరుగా కలిసేందుకు ప్రతి శనివారం మాత్రమే రావాలని సూచించారు.
నిజాయితీతో సేవలందించాలి
శాయంపేట (ఆత్మకూరు), వెలుగు : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు నిజాయితీతో సేవలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. వార్షిక పోలీసు స్టేషన్ల తనిఖీల్లో భాగంగా మంగళవారం సీపీ దామెర ఠాణాను తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాలు, సన్నిహిత కౌంటర్లను పరిశీలించి బాధితులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సిబ్బంది కిట్స్‌ను పరిశీలించారు. అనంతరం స్టేషన్లో సీపీ మొక్కను నాటారు. ఆయనవెంట ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ కిషోర్‌కుమార్, సీఐ రంజిత్‌కుమార్, ఎస్సై అశోక్ ఉన్నారు.