టార్గెట్‍ మేయర్.. డిప్యూటీ మేయర్‍ను ముందుపెట్టి అసమ్మతి టీం పాలిటిక్స్​

  • సుధారాణికి వ్యతిరేకంగా బీఆర్‍ఎస్‍, బీజేపీ కార్పొరేటర్ల మీటింగ్‍

వరంగల్‍, వెలుగు: గ్రేటర్ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ మేయర్‍ గుండు సుధారాణి టార్గెట్‍గా బల్దియా రాజకీయాలు సాగున్నాయి. ఎప్పటి నుంచో మేయర్‍ వర్సెస్‍ కార్పొరేటర్లు అన్నట్లుగా జీడబ్ల్యూఎంసీలో వాతావరణం నెలకొంది. సుధారాణిని మేయర్‍ పీఠం నుంచి దించడమే లక్ష్యంగా అప్పట్లో కార్పొరేటర్లు పలుమార్లు సీక్రెట్‍ మీటింగులు పెట్టుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మూడేండ్ల పాలన పూర్తవ్వాలనే నిబంధన ఉండటంతో సమయం కోసం ఎదురుచూశారు. 

సుధారాణి తీరు నచ్చని పలువురు కార్పొరేటర్లు బీఆర్‍ఎస్‍ నుంచి హస్తం పార్టీలో చేరారు. సుధారాణి సైతం అనూహ్యంగా కాంగ్రెస్‍ కండువా కప్పుకొన్నారు. అయినా కొన్ని రోజులు కోల్డ్​వార్‍ నడిచింది. ఆపై ఇష్యూ సద్దుమణిగిందని అందరూ భావిస్తుండగా, వీలైతే సుధారాణిని లేదంటే ఆమె చేరిన అధికార కాంగ్రెస్‍ పార్టీని ఇరుకునపెట్టేలా విపక్ష బీఆర్‍ఎస్‍, బీజేపీ కార్పొరేటర్లు స్కెచ్‍ వేస్తున్నారు. గురువారం గ్రేటర్‍ బడ్జెట్‍ వేదికను ముహూర్తంగా పెట్టుకున్నట్లు సమాచారం.  

సుధారాణి చేరికతో హస్తం ఖాతాలో మేయర్‍ పీఠం..

గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్‍ఎస్‍ నుంచి 48 మంది, బీజేపీ 10, కాంగ్రెస్‍ 4, ఏఐఎఫ్‍బీ 1, ఇండిపెండెంట్లు 3 గెలిచారు. ఆ తర్వాత  ముగ్గురు ఇండిపెండెంట్లు, మరో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లను బీఆర్‍ఎస్‍ తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో మొన్నటి వరకు బీఆర్‍ఎస్‍ 53 సీట్లతో బలంగా కనిపించింది. కాంగ్రెస్‍ కేవలం 4 కార్పొరేటర్లతో మూడో స్థానంలో ఉండగా, అసెంబ్లీ ఫలితాలు వచ్చిన నెలలోనే సీన్‍ మారింది. గ్రేటర్, వర్ధన్నపేట ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మెజార్టీ కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. చివరకు కారు పార్టీ నుంచి మేయర్‍గా ఉన్న గుండు సుధారాణి సైతం హస్తం పార్టీలో చేరింది. మొత్తంగా కాంగ్రెస్‍ బలం 37 కు చేరింది. కారు పార్టీ సంఖ్య 21కి అటుఇటుగా ఉంది. బీజేపీ సంఖ్య 10  అలాగే ఉంది. మొత్తంగా మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్‍ లో ఉండటానికితోడు గుండు సుధారాణి సైతం హస్తం పార్టీలోకి రావడంతో ఓ విధంగా గ్రేటర్‍ మేయర్‍ పీఠం హస్తం పార్టీ ఖాతాలో పడ్డట్లయింది.  

మిత్రులు శత్రువులైన్రు.. శత్రువులు మిత్రులైన్రు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్టీ మార్పుల నేపథ్యంలో గుండు సుధారాణికి మిత్రులు శత్రువులుగా, శత్రువులు మిత్రులుగా మారే వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‍ గెలవడంతో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కొండా సురేఖ, కేఆర్‍.నాగరాజు బీఆర్​ఎస్​ కార్పొరేటర్లను కాంగ్రెస్‍లో చేర్చారు. కాగా, మేయర్‍పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మూడేండ్ల పదవీ కాలం పూర్తవ్వాలనే నిబంధన ఉండటంతో ఈ ఏడాది మే నెల వరకు గడువు కోసం ఎదురుచూశారు. తీరా సుధారాణి కాంగ్రెస్‍లో చేరడంతో, ఇన్నాళ్లూ ఆమెను పదవి నుంచి దించాలని భావించిన కార్పొరేటర్లు సొంత పార్టీ లైన్‍లో మిత్రులుగా మారారు. సుధారాణి పార్టీలో చేరేవరకు మిత్రులుగా ఉన్న బీఆర్‍ఎస్‍ కార్పొరేటర్లు ఇప్పుడు శత్రువులుగా మారారు. వీరికి పలువురు బీజేపీ కార్పొరేటర్లు తోడయ్యారు. 

మేయర్‍ వర్సెస్‍ ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్‍ 

వరంగల్‍ బల్దియాకు 2021 ఏప్రిల్ 30న ఎలక్షన్లు జరిగాయి. అత్యధిక కార్పొరేటర్‍ సీట్లు సాధించిన బీఆర్‍ఎస్‍ నుంచి మే 7న గుండు సుధారాణి మేయర్‍గా బాధ్యతలు తీసుకున్నారు. డిప్యూటీ మేయర్‍గా రిజ్వానా షమీంను ఎంపిక చేశారు. ఆ తర్వాత మేయర్‍ ఒక వర్గంగా ఉండగా, సొంత పార్టీలోని మాజీ వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ మరో వర్గంగా ఉంటూ డిప్యూటీ మేయర్‍ భర్త మసూద్‍ను ముందుపెట్టి పాలిటిక్స్​నడిపించారు. దీంతో మేయర్‍ వర్సెస్‍ డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే అన్నట్లు గ్రేటర్‍ రాజకీయాలు నడిచాయి. ఎమ్మెల్యే వర్గంలో మెజార్టీ కార్పొరేటర్లు ఉండటంతో మేయర్‍ పీఠంలో ఉంటూనే సుధారాణి ఒంటరైంది. అయినా హైకమాండ్‍ సపోర్ట్​ సుధారాణికి ఉండటంతో అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచన ఉన్నా చేయలేకపోయారు.

రేపటి బడ్జెట్‍ మీటింగ్‍పై టెన్షన్‍  

పార్లమెంట్‍ ఎన్నికల కోడ్‍ కారణంగా గ్రేటర్‍ వరంగల్‍ బడ్జెట్‍ పెట్టలేదు. కోడ్​ ముగియడంతో ఈ నెల 20న బడ్జెట్​ను  ప్రవేశపెట్టాలని ముహూర్తం ఫిక్స్​చేశారు. కాగా, సుధారాణి అంటే పడనివారు బడ్జెట్‍ సమావేశాన్నితమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కలుపుతున్నారు. 66 మంది కార్పొరేటర్లలో బీఆర్‍ఎస్‍, బీజేపీ కలిస్తే 30 మంది కార్పొరేటర్లున్నారు. దీంతో వీలైతే కాంగ్రెస్‍లోనూ వ్యక్తిగతంగా సుధారాణి అంటే గిట్టనివారి సహకారంతో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

 అది వీలుకాని పక్షంలో సుధారాణి పనితీరు, సమస్యలు, ఫండ్స్​కేటాయింపులపై నిలదీయడం ద్వారా ఇన్నాళ్లూ జరిగిన ఫెయిల్యూర్‍ అంతా కాంగ్రెస్‍ పార్టీ ఖాతా వేసి ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బీఆర్‍ఎస్‍, బీజేపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్‍ రిజ్వానా షమీం ఛాంబర్‍లో సమావేశమయ్యారు. బలాబలాలపై చర్చించుకున్నారు. సమావేశాన్ని డిప్యూటీ మేయర్‍ భర్త మసూద్‍, దిడ్డి కుమారస్వామి వంటి కార్పొరేటర్లు లీడ్‍ చేశారు. అదే సమయంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‍ పార్టీలో చేరిన సుధారాణిని వ్యతిరేకించే  కార్పొరేటర్లు మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. మొత్తంగా రేపటి బడ్జెట్‍ సెషన్‍ గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ రాజకీయాలకు వేదికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.