కాంగ్రెస్‌‌లో చేరిన వరంగల్‌‌ కార్పొరేటర్లు

వరంగల్‌‌ సిటీ, వెలుగు : గ్రేటర్‌‌ వరంగల్‌‌ కార్పొరేషన్‌‌లో బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి మరో షాక్‌‌ తగిలింది. గులాబీ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్‌‌బై చెప్పారు. నగరంలోని 32వ డివిజన్‌‌ కార్పొరేటర్‌‌ పల్లం పద్మ రవి, 35వ డివిజన్‌‌కు చెందిన సోమిశెట్టి ప్రవీణ్‌‌కుమార్‌‌, 37వ డివిజన్‌‌ కార్పొరేటర్‌‌ వేల్పుగొండ సువర్ణతో పాటు ఆమె భర్త బోగి సురేశ్‌‌ కాంగ్రెస్‌‌లో చేరారు. 

వరంగల్‌‌ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోని మంత్రి కొండా సురేఖకు చెందిన క్యాంప్‍ ఆఫీస్‌‌లో గురువారం సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సమక్షంలో వారు కాంగ్రెస్‌‌ కండువా కప్పుకున్నారు. వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌‌ అనుచరులుగా ఉన్న ఈ ముగ్గురు కార్పొరేటర్లు సడన్‌‌గా పార్టీ మారడం చర్చనీయాంశమైంది. కాగా మరో ఇద్దరు కారు పార్టీ కార్పొరేటర్లు సైతం పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది.