ఒక్క కౌన్సిల్ హాల్ కట్టడానికి 11 ఏండ్లు పట్టింది

అధ్యక్షా అనడానికి ఇంకొన్నాళ్లు!

వరంగల్ , వెలుగు: జీడబ్ల్యూఎంసీలో ప్రజా సమస్యలు చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు ఇన్నాళ్లు వేదిక కరువైంది. 11 ఏండ్ల కింద పునాదుల పడిన కౌన్సిల్ హాల్ ఎట్టకేలకు తుదిరూపం దాల్చుకుంది. బుధవారం మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా ప్రారంభం అయింది. కానీ ఈ కొత్త బిల్డింగ్ లో కార్పొరేటర్లు అధ్యక్షా అనడానికి ఇంకొన్నాళ్లు ఆగక తప్పదు.

ఇదీ సంగతి..
వరంగల్ సిటీ కార్పొరేషన్ నుంచి గ్రేటర్ స్థాయికి ఎదిగింది. 11 ఏండ్ల కిందట సిటీలో కౌన్సిల్ హాలుకు పునాది వేశారు. ఆ తర్వాత అప్పటి పాలకవర్గం గడువు తీరడం.. స్పెషల్ ఆఫీసర్స్ పాలన రావడంతో శ్రద్ధ పెట్టేవాళ్లు కరువై పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తెలంగాణ ఏర్పడ్డాక 2015లో మరో పాలకవర్గం ఏర్పడినా ఈ భవనాన్ని పట్టించుకోలేదు. మేయర్ నరేందర్ తూర్పు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానంలో గుండా ప్రకాశ్ రావు బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బిల్డింగ్ పై దృష్టిపెట్టి పనులు స్పీడప్ చేశారు. ఇంకొన్ని పనులు పెండింగ్ లో ఉన్నప్పటికీ మంత్రితో ప్రారంభించారు. ప్రస్తుత పాలవకర్గ పదవీ కాలం మరో మూడు నెలలే ఉండటం, ఎన్నికల కోడ్ వస్తే ప్రారంభానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని భావించి హడావుడిగా ప్రారంభించారనే ప్రచారం జరుగుతోంది. పెండింగ్ పనులపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని, వెంటనే మిగిలిన పనులు చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఫాబ్రికేటర్ సిస్టంలో నెలన్నర రోజుల్లోనే వర్క్స్ మొత్తం కంప్లీట్ చేస్తామని ఆఫీసర్లు తెలిపారు. లీడర్ల హామీ మేరకు జనవరి 26 నాటికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, కౌన్సిల్ హాల్ ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నగర వాసులు కోరుతున్నారు.

For More News..

ప్రభుత్వానికి తెలివి ఎక్కువైనట్టుంది.. హైకోర్టు ఆగ్రహం

వీఆర్వోల మధ్య చిచ్చుపెట్టిన ‘పల్లా’ లెటర్​

డాక్టర్ స్లిప్ ఉంటే టెస్టులన్నీ ఫ్రీ