వంద మంది చుట్టుముట్టి.. డాక్టర్లతో కట్లు కట్టించుకున్నరు

  • అదుపులోకి తీసుకునేటప్పుడు స్వల్పగాయాలు కామన్
  • గన్​ తో బెదిరించలే.. వీడియో తీసి పంపలే 
  • కేయూ స్టూడెంట్ లీడర్లపై దాడి విషయంలో 
  • వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు పాత గాయాలను చూపెట్టి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, సెకండ్​ మెడికల్ ఎగ్జామినేషన్​ టైంలో దాదాపు వందమంది డాక్టర్లను చుట్టుముట్టి తమ ఇష్టమొచ్చినట్టు కట్లు కట్టించుకున్నారని వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్​ వెల్లడించారు. అరెస్టు చేసేప్పుడు జరిగే పెనుగులాటలో శరీరం కమిలిపోవడం, స్వల్ప గాయాలు కావడం కామనేనని చెప్పుకొచ్చారు. కేయూ విద్యార్థులపై దాడి ఘటనపై స్పందించిన సీపీ రంగనాథ్​ వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్​ తో కలిసి హనుమకొండ కలెక్టరేట్ ​కాన్ఫరెన్స్​ హాలులో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పీహెచ్​డీ అడ్మిషన్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఏబీవీపీతో పాటు ఇతర సంఘాల లీడర్లు కేయూ ప్రిన్సిపల్​ఆఫీసుపై​ దాడి చేశారని, దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారని చెప్పారు. 

కోర్టులో హాజరు పరిచే ముందు ఎంజీఎం దవాఖానలో మెడికల్​ఎగ్జామినేషన్​ చేయించామని, ఆ టైంలో ఎవరి ఒంటిపైనా గాయాలు లేవన్నారు. డాక్టర్ ​వాళ్లందరినీ ఎగ్జామిన్​ చేసి మెడికల్​సర్టిఫికెట్​ఇచ్చారన్నారు. కానీ, జడ్జి ముందుకు వెళ్లాక టాస్క్​ ఫోర్స్​ఆఫీస్​కు తరలించి పోలీసులు తమను కొట్టారని తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. దీంతోనే జడ్జి సెకండ్ ​ఎగ్జామినేషన్​కు పంపించారని, కానీ, డ్యూటీలో ఉన్న డాక్టర్ ​శ్రీలేఖను వంద మంది చుట్టుముట్టి కట్లు కట్టాల్సిందిగా ఒత్తిడి చేశారన్నారు. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా జడ్జి ఎదుట చెప్పారన్నారు. నెల కింద క్రికెట్​ ఆడుతుంటే ప్రశాంత్​కు తగిలిన గాయం మాత్రమే ఫ్రాక్చర్​గా తేలిందన్నారు. 

కేయూ వీసీ కళ్లలో ఆనందం చూసేందుకు తాను గన్ పెట్టి బెదిరించానని, దగ్గరుండి కొట్టానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కొంతమంది ఏబీవీపీ, ఇతర సం ఘాల లీడర్లు వీసీ చాంబర్,  ప్రిన్సిపాల్ ​ఆఫీస్​ డోర్ పగలగొట్టి కంప్యూటర్లు ధ్వంసం చేశారని, ఇందులో కొంతమంది  ఫిబ్రవరి 28న బైరి నరేశ్​పై దాడి చేశారన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టడం తమ అభిమతం కాదని, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించినా కొంతమంది పట్టించుకోవడం లేదన్నారు. తప్పు జరిగినప్పుడు  ప్రశ్నించే తత్వం ఉండాలని, కానీ అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పారు.

అక్రమంగా పీహెచ్​డీ అడ్మిషన్లు పొందేందుకే..

కేయూ పీహెచ్​డీ కేటగిరీ–2 అడ్మిషన్ల ప్రక్రియలో అవకతవకలు జరగలేదని, అక్రమంగా పీహెచ్​డీ అడ్మిషన్లు పొందేందుకే కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని వీసీ ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​ అన్నారు. వర్సిటీ ఆఫీసర్లపై ప్రెజర్​ పెంచి, గూండాయిజంతో కొందరు విద్యార్థులు అడ్మిషన్​ పొందాలని చూస్తున్నారన్నారు. 2017లో పీహెచ్​డీ అడ్మిషన్ల సమయంలోనూ ఇలాగే గందరగోళం సృష్టించారని, తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏ వీసీ ధైర్యం చేయలేదన్నారు. ఎంజీఎం ఆర్​ఎంవో-–2 మురళి, హనుమకొండ, స్పెషల్​బ్రాంచ్​ఏసీపీలు కిరణ్​కుమార్​, జితేందర్​రెడ్డి, కేయూ రిజిస్ట్రార్​సత్యనారాయణ, సీఐ అబ్బయ్య, ఎస్సైలు సురేశ్, సుమన్ పాల్గొన్నారు. 

8 మందికి బెయిల్​..ఇద్దరి రిమాండ్​

కేయూ ప్రిన్సిపల్ ఆఫీస్​ పై దాడి చేశారనే కారణంతో అరెస్ట్​ చేసిన 10 మంది స్టూడెంట్ ​లీడర్లను బుధవారం హనుమకొండ జిల్లా జడ్జి ఎదుట హాజరు పరగా..స్టూడెంట్ల వాంగ్మూలం మేరకు రీ మెడికల్ ఎగ్జామినేషన్​కు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఎంజీఎంలో బుధవారం రాత్రి ఒంటి గంట వరకు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ఎదుట హాజరు పరిచారు. రెండు గంటలకు  మాచర్ల రాంబాబు,  అరెగంటి నాగరాజు,  శ్రీకాంత్, అజయ్, మధు, కమల్, శంకర్, కుమార్ కు బెయిల్ మంజూరైంది. మరో ఇద్దరు అంబాల కిరణ్, మాచర్ల ప్రశాంత్ ను రిమాండ్​ చేయగా పరకాల సబ్​ జైలుకు తరలించారు.

కేయూలో నిరసన దీక్ష

పోలీసుల దాడిని నిరసిస్తూ కేయూ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు ఎస్​డీఎల్​సీఈ ఎదుట బైఠాయించారు.  వీరి దీక్షకు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, డీఎస్పీ, తదితర పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఏనుగుల రాకేశ్​రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి మాచర్ల రాంబాబు, ఆరెగంటి నాగరాజు, శ్రీకాంత్​ను పరామర్శించారు. కాంగ్రెస్​ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్​ రెడ్డి, పార్టీ నేత, రిటైర్డ్ సీపీ కేఆర్ నాగరాజు, జనగామ మాజీ డీసీసీ ప్రెసిడెంట్​జంగా రాఘవరెడ్డి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. కేయూ రిటైర్డ్​ప్రొఫెసర్​ కూరపాటి వెంకటనారాయణ విద్యార్థులకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు.  

మేమేమైనా టెర్రరిస్టులమా?  

పీహెచ్​డీ కేటగిరీ–2 అడ్మిషన్లలో వర్సిటీ అధికారులు యూజీసీ రూల్స్​ పాటించలేదని, ఒక్కో డిపార్ట్​మెంట్ కు ఒక్కో రకంగా రూల్స్​ మార్చుకున్నారని ఏబీవీపీ నాయకుడు మాచర్ల రాంబాబు ఆరోపించారు. పార్ట్​ టైం వాళ్లకు అడ్మిషన్​ ఇచ్చుకోవడానికే ఇలా చేశారని, దీన్ని ప్రశ్నిస్తూ శాంతియుత నిరసన తెలిపితే అరెస్ట్​ చేశారన్నారు. ​స్టేషన్​లో విపరీతంగా కొట్టారని ఆరోపించారు. రాత్రి 11గంటలకు సీపీ స్టేషన్​కు వచ్చి ఎవరి కండ్లలోనో ఆనందం చూడడానికి  తమపై దాడి చేయించారని, చచ్చిపోతామని మొత్తుకున్నా దయ చూపలేదన్నారు. 

అంకెళ్ల శంకర్​ మాట్లాడుతూ పోలీసులు తన్నుకుంటూ, కొట్టుకుంటూ తీసుకెళ్లారని, తామేమైనా టెర్రరిస్టులమా?  అని ప్రశ్నించారు. 75 శాతం సీట్లు అమ్ముకుంటే.. మెరిట్​వచ్చిన తమలాంటి స్టూడెంట్స్​పరిస్థితి ఏమిటన్నారు. ఆరెగంటి నాగరాజు మాట్లాడుతూ అధికారులు పీహెచ్​డీ సీట్లను అమ్ముకుంటుంటే పోలీసులు వీసీకి తొత్తులుగా ప్రవరిస్తున్నారన్నారు.