
- వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్
- వరంగల్, హనుమకొండ, జనగామ కలెక్టర్లు ఆఫీసర్లతో రివ్యు
హనుమకొండ,వెలుగు: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు బ్లాక్ స్పాట్లపై ఫోకస్పెట్టాలని వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్ సూచించారు. రోడ్డు భద్రతా చర్యలను ముమ్మరం చేయడం వల్ల యాక్సిడెంట్లను నివారించవచ్చని చెప్పారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామ, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు, ఆర్టీఏ, పోలీస్, హైవే, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, మున్సిపల్, ఆర్టీసీ ఆఫీసర్లతో బుధవారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ‘రోడ్డు భద్రతా సమావేశం–2023’ నిర్వహించారు. ముందుగా గత మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి అడిషనల్ డీసీపీ పుష్పారెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం సీపీ రంగనాథ్ మాట్లాడుతూ కమిషనరేట్‌లో ఏటా యాక్సిడెంట్లు, డెత్స్ ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ల నియంత్రణకు ప్రతిఒక్కరూ రూల్స్ పాటించాలని సూచించారు. ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా స్థాయి కమిటీలు పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. హైవేపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు లేకపోవడం, యూ టర్న్‌లు కనిపించకపోవడంతో పాటు డ్రైవర్ల తప్పిదాలు, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కారణాలతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు. రాత్రి సమయంలో కూడా కనిపించేలా రోడ్లపై రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్‌హెచ్ అప్రోచ్ రోడ్లపై సోలార్ బ్లింకర్స్, మెయిన్ జంక్షన్ల వద్ద విద్యుత్ దీపాలు పెట్టాలన్నారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ హసన్‌పర్తి పెద్ద చెరువు ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయని, జిల్లాలో 38 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లా ఆఫీసర్లు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తేనే యాక్సిడెంట్లను నియంత్రించవచ్చన్నారు. జనగామ కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని,ఆయా చోట్ల భద్రతాచర్యలు పాటించాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో వాసుచంద్ర, డీఎంహెచ్‌వో సాంబశివరావు, ఆర్టీవో ఆఫ్రీన్ సిద్దిఖ్ తదితరులు పాల్గొన్నారు.
సెల్‌ఫోన్ పోతే కంగారు పడొద్దు
వరంగల్ క్రైం, వెలుగు : సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(www.ceir.gov.in) వెబ్‌సైలో వివరాలు నమోదు చేయాలని వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్సూచించారు. సీఈఐఆర్వెబ్సైట్ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్న 78 సెల్‌ఫోన్లను సీపీ ఆఫీస్‌లో బుధవారం వాటి యజమానులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టెలికాం మంత్రిత్వశాఖ అధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్‌లో సమాచారం ఎంటర్ చేసిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌లో వివరాలు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ మురళీధర్, అడ్మిన్ డీసీపీ పుష్ప, ఐటీ కోర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఏఏవో సల్మాన్ పాషా పాల్గొన్నారు.