
- ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర
- బండి సంజయ్ డైరెక్షన్‍లోనే టెన్త్ హిందీ పేపర్ లీకేజీ ప్రచారం : సీపీ రంగనాథ్
- అందుకే ఏ1గా చేర్చి, కేసు ఫైల్ చేశాం
- గ్రూపుల్లో మెసెజ్‍లు షేర్ చేసినందుకు కేసులు పెట్టట్లే
- తల్లిదండ్రులు ఆందోళన చెందడానికి కారకుడు సంజయే
- సెక్షన్ 41 ప్రకారం అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదని వెల్లడి
వరంగల్/హనుమకొండ, వెలుగు : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డైరెక్షన్‍లోనే టెన్త్ హిందీ పేపర్ లీకేజీ ప్రచారం జరిగిందని, అందుకే ఆయనను ఏ1 గా చేర్చి, కేసు ఫైల్ చేశామని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ చెప్పారు. మైనర్ పేపర్ బయటకు తెస్తే.. మిగతావారు దానిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినప్పటికీ.. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా సంజయ్ తెరవెనుక కుట్ర చేశారని, తల్లిదండ్రుల ఆందోళనకు కారకుడు ఆయనేనన్నారు. ఓ మర్డర్ కేసును ఉదహరిస్తూ.. పేపర్ బయటకు తెచ్చిన వ్యక్తి కత్తి కొన్న వారైతే.. సంజయ్ అనే అతను దానితో మర్డర్ చేసిన వ్యక్తి అంటూ పోల్చి చెప్పారు.
టెన్త్ హిందీ పేపర్ లీకేజీ అంశంపై వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితులు హిందీ పేపర్ సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు కేసులు పెట్టట్లేదని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా ఒకరోజు ముందు నుంచే కుట్ర జరిగిందన్నారు.
సంజయ్, ప్రశాంత్ ముందుగానే మాట్లాడుకున్నరు
ఏ2 బూర ప్రశాంత్, ఏ3 గుండెబోయిన మహేశ్ సోషల్ మీడియాలో పేపర్ లీకేజీ ప్రచారం చేసి విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేశారన్నారు. సంజయ్, ప్రశాంత్ ముందురోజు వాట్సప్‍లో మాట్లాడుకున్న అంశాలే.. సంజయ్ మాటల రూపంలో తెల్లారి పేపర్‍లో వచ్చాయన్నారు. టెన్త్ హిందీ పేపర్‍తోపాటు తెలుగు పేపర్ కూడా ప్లాన్ ప్రకారమే బయటకొచ్చిందని సీపీ వివరించారు. కమలాపూర్‍లో మైనర్ మొదట పేపర్‍ను ఫొటోతీసి మంగళవారం ఉదయం 9.47కు ఓ గ్రూపులో పోస్ట్ చేయగా.. ప్రశాంత్ 9.30 గంటలకే పేపర్ లీకేజీ అంటూ తప్పుడు పోస్టింగులు పెట్టి విద్యార్థుల పేరెంట్స్ ను ఆందోళనకు గురిచేశారన్నారు.
ప్రశాంత్ వరంగల్‌లోని జర్నలిస్టుల గ్రూప్‍తోపాటు 11.18 గంటలకు హైదరాబాద్‍లోని మీడియా పెద్దలకు వాట్సాప్ చేశాడన్నారు. 11.24 గంటలకు అదే పేపర్ పోస్టింగ్‍ను సంజయ్‍కు ఫార్వర్డ్ చేసినట్లు తెలిపారు. దాని ఆధారంగానే ప్లాన్ ప్రకారం సంజయ్ 11.30 నుంచి 11.50 గంటల వరకు మీడియాతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. సంజయ్‍తో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇతర బీజేపీ లీడర్లకు ప్రశాంత్ పేపర్ లీకేజీ మెసేజ్ పంపాడన్నారు.
సంజయ్‍పై నాన్ బెయిలబుల్ కేసులు
సంజయ్ అరెస్ట్ సమయంలో ఫోన్ అడిగితే మిస్ అయిందని చెప్పారని, నిర్దోషి అయితే అలా చెప్పాల్సిన అవసరమేమిటని సీపీ ప్రశ్నించారు. నిందితుల ఫోన్లలో చాలా చాటింగ్స్ డిలీట్ చేశారని, టెక్నాలజీ ఆధారంగా వేరే రూపంలో సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. సంజయ్‍పై పెట్టినవన్నీ నాన్ బెయిలబుల్ కేసులేనని, నేరం నిరూపణ అయితే 3 ఏండ్ల నుంచి 7 ఏండ్ల వరకు శిక్ష తప్పదన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో పేపర్ బయటకు రావడంలో పోలీసుల వైఫల్యం లేదా అని ప్రశ్నించగా.. టెన్త్ సెంటర్లు వేలల్లో ఉంటాయని, ఒకరిద్దరు కానిస్టేబుళ్లతో భద్రత ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయన్నారు.
ఎంపీ అయిన సంజయ్‍ను అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదని సీపీ తెలిపారు. సెక్షన్ 41, 41(ఏ) సీఆర్‍పీసీ ప్రకారం ఎంపీని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. కమలాపూర్‍లో కేసు నమోదైనందు వల్లే కరీంనగర్‍లో అరెస్ట్ చేసి సంజయ్‍ను వరంగల్ తరలించినట్లు చెప్పారు. సంజయ్ అరెస్ట్ సమాచారాన్ని లోక్‌సభ స్పీకర్‍కు తెలియజేసినట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఎంక్వైరీ చేస్తున్నామని సీపీ చెప్పారు.