
నర్సంపేట, వెలుగు : వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ఫోటోకు రైతు దంపతులు క్షీరాభిషేకం చేశారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట టౌన్‌లోని 19 వ వార్డుకు చెందిన నాడెం వీరస్వామి తనకున్న రెండు ఎకరాల్లో 20 గుంటలు 2018 మే నెలలో నర్సంపేట శివారు ఏనుగుల తండాకు చెందిన బానోతు అనిల్ నాయక్, అతడి సోదరుడు బానోత్ సునిల్ నాయక్‌కు అమ్మాడు. మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. కొద్ది కాలంగా అనిల్, సునిల్మరో పది గుంటల భూమి తమకు అమ్మాలని వీరస్వామిని ఒత్తిడి చేస్తున్నారు.
వీరస్వామి ఒప్పుకోకపోవడంతో కులం పేరుతో దూషించాడంటూ ఫిబ్రవరి 27న నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీరస్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ వీరస్వామి వరంగల్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. విచారణలో తప్పుడు కేసు పెట్టారని తేలడంతో వీరస్వామిపై అట్రాసిటీ కేసు తీసేయాలని సీపీ రంగనాథ్ఆదేశించారు. వీరస్వామిని బెదిరించిన బానోతు అనిల్‌నాయక్, సునిల్నాయక్, సీతారాంనాయక్, చింతల నిరంజన్‌తో పాటు మరో ఏడుగురిపై కేసు ఫైల్ చేయాలని ఆదేశించడంతో నర్సంపేట పోలీసులు కేసు ఫైల్‌చేశారు.
ఎట్టకేలకు తనకు న్యాయం జరిగిందని హర్షిస్తూ రైతు దంపతులు వీరస్వామి, రాజ్యలక్ష్మి శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి నర్సంపేట అమరవీరుల స్మారక స్థూపం వద్ద సీపీ రంగనాథ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.