- వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి
వరంగల్‌క్రైం, వెలుగు: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొద్దిరోజులు సెల్ ఫోన్ దూరం పెడితే కొలువు సాధించడం సులువవుతుందని వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి అన్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్అవుతున్న వారికి ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి వరంగల్, హనుమకొండ డివిజన్ల నుంచి మొత్తంగా 500 మందిని ఎంపిక చేశారు. హనుమకొండ డివిజన్ నుంచి ఎంపికైన 250 మందికి సుబేదారి ఆర్ట్స్ కాలేజీ, వరంగల్ డివిజన్ లో ఎంపికైన 250 మందికి ఎల్ బీ కాలేజీలో కోచింగ్ఇవ్వనున్నారు. 80 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఫ్రీ కోచింగ్ క్లాస్‌లను మంగళవారం సీపీ డా.తరుణ్ జోషి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిబద్ధతతో చదివితే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చాన్నారు. ముఖ్యంగా ఓ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలని, తరువాత సమయం వృథా చేయకుండా చదువుకోవాలన్నారు. కోచింగ్ సమయంలో సిలబస్ పై ఎలాంటి సందేహాలున్నా వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా రెడ్డి, హనుమకొండ, వరంగల్ ఏసీపీ జితేందర్ రెడ్డి, గిరికుమార్, సుబేదారి, హనుమకొండ, మట్వాడా, కేయూసీ, మహిళా పీఎస్ సీఐలు రాఘవేందర్, వేణుమాధవ్, గణేశ్, జనార్ధన్ రెడ్డి, సతీష్, పీజేఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్ పాల్గొన్నారు.