
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని సీనియర్ డాక్టర్ సైఫ్ టార్గెట్ చేసి వేధించాడని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. సైఫ్ గత నాలుగు నెలలుగా ప్రీతిని వేధించినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. ప్రీతి ఆత్మహత్య ఘటనపై సీపీ మీడియాతో మాట్లాడారు. వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడని చెప్పారు. గ్రూప్ లలో మెసేజ్ లు పెట్టి వేధించొద్దని ప్రీతి వేడుకున్నా సైఫ్ వినలేదన్నారు. బ్రెయిన్ లేదంటూ సైఫ్ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. సైఫ్ వేధింపులు తట్టుకోలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందన్నారు.
వాట్సాప్ గ్రూపులలో మెసేజ్ లు పెట్టి వేధించడం కూడా ర్యాగింగ్ కిందకే వస్తుందని సీపీ తెలిపారు. నిందితుడిపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టామని..కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని వెల్లడించారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రచారం చేయడం సరికాదన్నారు. సైఫ్ కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదన్న సీపీ.. పోలీసులు రియాక్ట్ కాలేదన్నది అవాస్తమన్నారు.