ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు కొట్టలేదు.. అన్నీ అబద్దాలే : వరంగల్ సీపీ

ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు కొట్టలేదు.. అన్నీ అబద్దాలే : వరంగల్ సీపీ

కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారనేది అవాస్తవం అన్నారు వరంగల్ సీపీ రంగనాథ్. ఒక స్టూడెంట్ కు మాత్రమే చిన్న ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యిందన్నారు. అనుమానం ఉంటే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించవచ్చన్నారు. ప్రశాంత్ అనే విద్యా్ర్థికి అయిన ప్రాక్చర్ కూడా నెల క్రితం జరిగిందన్నారు. లేని గాయాలకు విద్యార్థులు కట్లు కట్టుకున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. 

ఆందోళనలు, నిరసనల పేరిట విద్యార్థులు దాడులు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. కొంతమంది విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టామని, ఇద్దర్ని జైలుకు కూడా పంపించామన్నారు. ఏ4 అంబాల కిరణ్ అనే వ్యక్తిపై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. ఏ2 ప్రశాంత్ అనే విద్యార్థిపైనా కూడా కేసులు ఉన్నాయన్నారు. కాలేజీలోని ఫర్నిచర్, కంప్యూటర్లను పగలగొట్టడం హీరోయిజమా...? అని ప్రశ్నించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

ఆరోపణల్లో నిజం లేదు..  

కేయూ వీసీ కళ్లలో ఆనందం చూసేందుకు తాను గన్ పెట్టి బెదిరించానని కేయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారని, తానే దగ్గరుండి కొట్టానని చెబుతున్నారని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు సీపీ రంగనాథ్. కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు వీసీ చాంబర్ డోర్ పగలగొట్టి, కంప్యూటర్లు ధ్వంసం చేశారని చెప్పారు. ఈ విద్యార్థులే ఫిబ్రవరి 28వ తేదీన బైరి నరేష్ పై దాడి చేశారని చెప్పారు. వైద్య పరీక్షల బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని ఆరోపించారు. తమను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారని అన్నారు. పాత గాయాలు చూపి జడ్జిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఇలాంటి ఆరోపణలు తమకు కొత్తమీ కాదన్నారు. కేయూలో చాలా సంఘాలు ఉన్నా కొందరే ఇలా చేశారని చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఊరుకోబోమని ముందే హెచ్చరించినా విద్యార్థులు పట్టించుకోలేదన్నారు. కేయూలో తప్పులు జరిగితే చట్టం, కోర్టుల ద్వారా పోరాడవచ్చు గానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా...? అని ప్రశ్నించారు. 

విద్యార్థుల ఆందోళన ఎందుకంటే..? 

కేయూలో పీహెచ్డీ కేటగిరీ 2 అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రోజు (సెప్టెంబర్ 5న) కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కేయూ ప్రిన్సిపాల్ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఏబీవీపీ విద్యార్థులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ప్రిన్సిపాల్ ఆఫీసులోని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర ఫర్నిచర్ ను కొందరు విద్యార్థి సంఘాల నేతలు ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

విద్యార్థి నేతల ఆరోపణలు

విద్యార్థి సంఘాల లీడర్లు మాచర్ల రాంబాబు, గట్టు ప్రశాంత్, నాగరాజు, అంబాల కిరణ్, అజయ్, శ్రీకాంత్, మధు, కమల్, శంకర్, కుమార్ ను మంగళవారం రోజు సాయంత్రం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తీసుకెళ్లారు. తిరిగి బుధవారం రోజు మధ్యాహ్నం కోర్టులో హాజరు పరిచేందుకు ముందుగా అందరికీ మెడికల్ టెస్టులు చేసి, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని రిపోర్ట్ సబ్మిట్ చేశారు.

ALSO READ : గేటు మధ్యలో ఇరుక్కుపోయిన బాలుడి తల

జడ్డి ఎదుట విద్యార్థి నేతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. టాస్క్ ఫోర్స్ స్టేషన్ లో తమను ఇష్టం వచ్చినట్లు పోలీసులు కొట్టారని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో జడ్జి రీ మెడికల్ టెస్టులకు ఆదేశించారు. ఎంజీఎంలో బుధవారం రాత్రి మళ్లీ టెస్టులు చేశారు. 

ఇప్పటికైనా పీహెచ్ డీ కేటగిరీ 2 అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని, అర్హులందరికీ న్యాయం చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

అవకతవకలు లేవు : కేయూ వీసీ రమేష్ 

PHD కేటగిరి-2 అడ్మిషన్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు కాకతీయ యూనివర్శిటీ వీసీ రమేష్. పారదర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించామని చెప్పారు. దౌర్జన్యం చేస్తే పాలకవర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారని అన్నారు. ప్రతిభ ఉన్నవారికే సీట్లు కేటాయించామన్నారు. తమకు కులం, మతంతో సంబంధం లేదన్నారు. రూల్స్ కు అనుగుణంగానే సీట్లు కేటాయించామని చెప్పారు. సెప్టెంబర్ 5న తన చాంబర్ వద్దకు వచ్చిన కొందరు విద్యార్థులు డోర్లు తన్నుకుంటూ... అసభ్యపదజాలంతో గొడవ చేశారని చెప్పారు. కొంతమంది అక్రమ మార్గంలో PHD అడ్మిషన్లు పొందేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.