ఆత్మకూరు ఎస్ఐ సస్పెన్షన్​

ఆత్మకూరు ఎస్ఐ సస్పెన్షన్​

ఆత్మకూరు, వెలుగు :  హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపాడు జాతరలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గీయుల మధ్య ఏర్పడిన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ఈ గొడవకు సంబంధించి కొందరు బీఆర్ఎస్​లీడర్లను అరెస్ట్​ చేసే సమయంలో ఆత్మకూరు ఎస్ఐ ప్రసాద్​దాడి చేశారని ఆరోపణలు రావడంతో వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అగ్రంపాడు జాతరలో దర్శనానికి వచ్చి బయటకు వెళ్తున్నారు. అదే టైంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు లోపలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు నినాదాలు చేసుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. 

ఈ సందర్భంగా తన విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ రమేశ్​..చల్లా ధర్మారెడ్డి అనుచరులపై ఫిర్యాదు చేయగా బీఆర్ఎస్​కు చెందిన పది మంది ముఖ్య కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆ సయమంలో ఎస్సై ప్రసాద్ బీఆర్ఎస్ లీడర్లను తీవ్ర పదజాలంతో దూషించాడని, అరెస్టుకు సహకరించని వారిని కొట్టారని మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, స్టేషన్ ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇతర బీఆర్ఎస్ లీడర్లతో కలిసి సోమవారం వరంగల్ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసిన వరంగల్ సీపీ ఆత్మకూరు ఎస్సై ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.