ఓనర్​ పేరిట నమ్మించి రూ.1.68 కోట్లు కొట్టేశాడు .. యూపీకి చెందిన నిందితుడి అరెస్ట్​

ఓనర్​ పేరిట నమ్మించి రూ.1.68 కోట్లు కొట్టేశాడు .. యూపీకి చెందిన నిందితుడి అరెస్ట్​
  • వరంగల్ ​సైబర్​ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ వెల్లడి 

హనుమకొండ, వెలుగు: ప్రముఖ హెచరీస్​సంస్థలో గుమస్తాకు ఓనర్ పేరున మెసేజ్​చేసి రూ.కోటిన్నరకుపైగా కొట్టేసిన సైబర్​మోసగాడిని వరంగల్ సైబర్​ క్రైమ్​పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సైబర్ క్రైమ్ స్టేషన్ ఇన్​చార్జ్ డీఎస్పీ ఫణిందర్ మంగళవారం వివరాలను మీడియాకు తెలిపారు.   యూపీలోని ప్రతాప్ గఢ్​జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్(39) హనుమకొండలోని ఓ ప్రముఖ హెచరీస్​సంస్థలోని  గుమస్తాకు గత నెల 19న వాట్సాప్​మెసేజ్​పంపాడు. సంస్థ ఓనర్ ను అని , ఇది కొత్త ఫోన్ నంబర్ అని.. సేవ్​ చేసుకోవాల్సిందిగా మెసేజ్​ లో తెలిపాడు.

 నమ్మిన గుమస్తా సేవ్​ చేసుకోగా.. కొద్దిరోజుల కింద ప్రదీప్​కుమార్​వాట్సప్ కాల్ చేశాడు. ఎక్కడ ఉన్నావ్.. ఎలా ఉన్నావ్​అనే వివరాలు అడిగి.. సంస్థ అకౌంట్ నుంచి తను చెప్పిన అకౌంట్​ కు డబ్బులు ట్రాన్స్​ఫర్​చేయాలని సూచించాడు. దీంతో గుమస్తా అవతలి వ్యక్తి చెప్పినట్టుగా రెండుసార్లు రూ.1.68 కోట్లు ట్రాన్స్​ఫర్​ చేశాడు. మరోసారి ఫోన్ రాగా గుమస్తా అనుమానించాడు. ఓనర్​పర్సనల్​నంబర్ కు ఫోన్​చేసి ఆరా తీశాడు. 

దీంతో మోసపోయినట్టు తెలుసుకుని ఓనర్ తోపాటు గుమస్తా వెంటనే వరంగల్ సైబర్ క్రైమ్ ​స్టేషన్ లో  కంప్లయింట్ చేశారు.  కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టి, టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సోమవారం రాత్రి అతడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపారు.  నిందితుడి పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సైబర్ క్రైమ్స్ సీఐ యాసిన్, ఎస్ ఐలు చరణ్, శివ, సిబ్బందిని డీఎస్పీ ఫణిందర్​అభినందించారు.