రైతులు ఆక్రోశంతో రగిలిపోతున్నారు

రుణమాఫీ అమలుకాక, వానలకు పంట నష్టపోతే పరిహారం రాక, మార్కెట్​లో మద్దతు ధర దొరక్క.. తెలంగాణలో నిత్యం ఎక్కడో ఓ చోట రైతు ప్రాణం తీసుకుంటూనే ఉన్నాడు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. సర్కారు తెచ్చిన ‘ధరణి’ అనేక భూ సమస్యలకు కారణమైంది. పోడు రైతుల గోసలు అన్నీ ఇన్నీ కావు. టీఆర్ఎస్​ ప్రభుత్వ పాలనలో ఇలా సమస్యల్లో కూరుకుపోయిన రైతుల్లో ఓరుగల్లు ‘రైతు డిక్లరేషన్’ ఆశలు పెంచుతోంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న చరిత్ర ఉన్న కాంగ్రెస్​ వైపు ప్రజలు, రైతులు ఆశగా చూస్తున్నారు. 
కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న రైతన్నల కన్నీళ్లు, కడగళ్లు తీర్చడమే లక్ష్యంగా పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా కాంగ్రెస్ ప్రకటించిన ‘వరంగల్ డిక్లరేషన్’ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తెలంగాణ రైతాంగాన్ని దగా చేసిన టీఆర్‌ఎస్ నాయకుల్లో వణుకు పుట్టిస్తూనే.. రైతన్నలకు భరోసా ఇస్తోంది. అన్నదాత‌లంద‌రూ ఈ డిక్లరేషన్ పై  విస్తృతంగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు జరిగే మేలు గురించి  చాయ్ బండి మొదలుకుని పొలం గట్లపైనా మాట్లాడుకుంటున్నారు.

ఈ డిక్లరేషన్ సమున్నత లక్ష్యాలకు మేధావులు, విద్యావంతులే కాదు అన్ని వర్గాల వారు దగ్గరవుతున్నారు.
కాంగ్రెస్‌ వాదులు కాకపోయినా.. పార్టీతో సంబంధం లేకపోయినా సరే ‘డిక్లరేషన్’  గురించి సానుకూలంగా మాట్లాడుకుంటున్నారు. డిక్లరేషన్‌లోని అంశాలు అమలైతే ఆగమాగమైన రైతన్నల జీవితాలు ఓ తొవ్వకు రావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ‘వరంగల్ డిక్లరేషన్’‌కు కనెక్ట్ కాని వర్గమంటూ లేదని క్షేత్రస్థాయి నుంచి అందుతున్న నివేదికలు పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ ను నింపుతున్నాయి. టీఆర్‌ఎస్ అరాచక పాలనపై, సర్కారు దాష్టీకాలపై ప్రజల్లో చర్చకు తీసుకువచ్చేలా చేయడంలో  ‘వరంగల్ డిక్లరేషన్’ పెద్ద విజయం 
సాధించినట్లయింది.  
రుణమాఫీ లేక..
కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తదనే నమ్మకం ఉంది. తెలంగాణ ఇస్తమన్నది.. ఇచ్చింది. ఉచిత విద్యుత్ అమలు చేసింది. రుణమాఫీ చేసింది. ఇలా అధికారికంగా ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చింది. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వెనుకాడిన సందర్భం కాంగ్రెస్ చరిత్రలో లేదు. ఇలాంటి రుజువుల నేపథ్యంలో.. స్వయంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన భరోసాతో ‘వరంగల్ డిక్లరేషన్’పై రైతన్నలకు విశ్వాసం కలుగుతోంది. ఒకప్పుడు కేసీఆర్ అంటే ఓ రకమైన మోహం. ఏదో చేస్తాడని ప్రజలు గొప్పగా ఊహించుకున్నారు.

ఎంతగానో ఆశించారు. కానీ నట్టేట ముంచాడు. ఈ విషయం ఇప్పుడు రైతుల అనుభవంలోకి వస్తోంది. కేసీఆర్ ఏంది? ఆయన చెప్పిన మాట ఏంది? చేసింది ఏంది? అనే అనుభవం రైతులకు ఎరుక‌లోకి వ‌చ్చింది. ఆశలు కల్పించి తడిగుడ్డతో గొంతు కోస్తున్నారనే భావన వారిలో ఉంది. ఇచ్చిన ఒక్క హామీని నెర‌వేర్చిన దాఖ‌లాలు లేవు. ఎనిమిదేండ్ల తర్వాత కూడా రుణమాఫీ చేసే దిక్కూమొక్కూ లేకుండా పోయింది.  ప్రభుత్వం మాఫీ చేస్తదనే ఆశతో ఆగిన రైతులకు బ్యాంకు వడ్డీ రెండింతల భారమైంది. ఇది వారి ప్రాణాలను తీస్తోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. కళ్లాల్లోనే వరి కుప్పలు నానిపోతున్నాయి.

రైతన్న అంటేనే.. ఆగమాగం అనే నానుడి మళ్లీ దాపురించింది. సర్కారు పేనిన ఉరితాళ్లకు రైతన్నలు ఇంకా బలి అవుతూనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేసినా రైతులే కాదు తెలంగాణలోని సమస్త వర్గాలు నమ్మే స్థితిలోలేవు. రైతన్నల చెమటలతో స్నానం చేసి.. వారి కన్నీటితో కడుపు నింపుకుని గద్దెనెక్కిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. అదే అన్నదాతల గొంతు పిసికి ఊపిరి తీస్తోంది. ప్రతి రోజూ.. ఎక్కడో ఓ చోట.. రైతన్నను ఉరి కొయ్యకు వేలాడదీస్తోంది. చావు డప్పును మోగిస్తూనే ఉంది. 
రైతుల ఆత్మహత్యలు..
ఇది రైతు రాజ్యం కాదు.. అన్నదాతల ఆత్మహత్యల రాష్ట్రం అని.. టీఆర్ఎస్ సర్కారు అత్యంత విఫల ప్రభుత్వమని కాంగ్రెస్ ‘వరంగల్ డిక్లరేషన్’తో ప్రజలకు ఎరుక చేసింది. దీంతో మళ్లీ ఆ పార్టీ అబద్ధాలనే నమ్ముకుంటోంది. మసిపూసి మారేడుకాయ చేసి..  ప్రగల్భాలు పలుకుతూ.. ధమ్కీలకు దిగజారుతోంది. బెదిరింపులకు బరితెగిస్తోంది. తన అసమర్థ విధానాలతో రైతన్నల ఉసురు తీస్తున్న ఈ చేతగాని ప్రభుత్వం.. తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు మళ్లీ ప్రజలను మాయలో, మత్తులో, భ్రమలో ముంచేందుకు నానా యాగీ  చేస్తోంది.
రైతుల మరణాల లెక్కలను, వారికి చెల్లించిన పరిహారాన్ని ఘనతగా చెప్పుకుంటూ నిర్లజ్జగా వ్యవహరిస్తోంది. అవే అబద్ధాలను మళ్లీ మళ్లీ వల్లె వేసి.. అవే..మోసపూరిత ప్రకటనలు, అవే అబద్ధపు హామీలతో దగా చేసేందుకు గొంతు చించుకుంటోంది. ప్రజలను మరోసారి భ్రమల్లో ముంచి మభ్యపెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో గత 8 ఏండ్లలో 8,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే రోజుకు సగటున ముగ్గురు రైతులు ప్రాణం తీసుకున్నరు. 2020లో రాష్ట్రవ్యాప్తంగా 760 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కానీ.. గత నాలుగేండ్లలోనే 74 వేల మంది రైతులు చనిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది. కౌలు రైతులదీ అదే పరిస్థితి. 
గత ఎనిమిదేండ్లలో5,200 మందికి‌పైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పలు రైతు సంఘాలు వెల్లడించాయి.రుణమాఫీ, పంటల బీమా లేవు. వర్షాలకు పంట దెబ్బతింటే పరిహారం లేదు. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట లేదు.ఇలా రైతులను ఆదుకునే సమగ్ర చర్యలు లేక వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ‘వరంగల్ డిక్లరేషన్’ రైతన్నలకు ఊరట నిస్తోంది. గతంలో కాంగ్రెస్ నెరవేర్చిన హామీలు వారి కళ్లముందు కదలాడుతున్నాయి. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, క్వింటాలు వడ్లకు రూ.2500 మద్దతు ధర, ప్రతి రైతుకు ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రూ.12 వేలు సాయం లాంటి ప్రకటనలు రైతుల్లో భరోసా కల్పిస్తున్నాయి. 
పోడు సమస్యలు
పోడు వ్యవసాయం విషయంలో గిరిజనులు, అటవీశాఖ అధికారుల మధ్య నిత్యం యుద్ధ వాతావరణం నెలకొంటోంది.  ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పోడు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అనేక చోట్ల గిరిజనులపైనా, ఆదివాసీలపైనా అధికారులు దాడి చేసిన ఘటనలను కూడా చూశాం. మహిళలు అని కూడా చూడకుండా చెట్లకు కట్టేసి కొట్టినటువంటి దారుణమైన ఘటనలూ చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పోడు సమస్యను పరిష్కరిస్తామని వరంగల్ డిక్లరేషన్ వెల్లడించింది.
‘‘నేనే క్షేత్రస్థాయికి  వెళ్లి కుర్చీ వేసుకుని మరీ పోడు సమస్యలను తీరుస్తాను’’ అని కేసీఆర్ చేసిన ప్రకటన నీటమూటగానే తేలటంతో ఆదివాసీలు, గిరిజనులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి  సమస్యలు చెప్పుకోలేక.. చెప్పుకునేందుకు మార్గం లేక.. చెప్పుకున్నా తీరే అవకాశాల్లేక.. రైతన్నలు తీవ్ర నిరాశలో ఉన్న ఈ సందర్భంలో  రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రకటించిన ‘వరంగల్ డిక్లరేషన్’ పై ప్రజల్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. అన్నదాతల కష్టాలను ఎలుగెత్తడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. అదే రైతన్నలకు ఆసరాగా.. భరోసాగా నిలుస్తోంది. రాష్ట్రంలో రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం రావాలని వారు కోరుకుంటున్నారు. 
ధరణి రద్దు ప్రకటనపై..
ధరణి పోర్టల్​ పేరిట తమ సొంత భూమిపై తమకే హక్కు లేకుండా చేసిన ప్రభుత్వంపై ప్రజలు, రైతులు ఆక్రోశంతో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, ఆ పార్టీ నేతలు వేలాది ఎకరాల భూమిని కబ్జా చేసుకునే కుటిల ప్రయత్నాల్లో భాగంగానే ‘ధరణి’ రూపుదిద్దుకున్నది. తమను అష్టకష్టాల పాలు జేస్తూ  ప్రాణాలు తీస్తున్న ‘ధరణి’ వద్దు మొర్రో అని ప్రజలు ఎంత మొత్తుకుంటున్నా దాన్ని  కొనసాగించడం వెనుక పెద్ద కుట్ర ఇదే.
‘ధరణి’ విదిల్చిన పంజాను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై పలువురు రైతులు కలెక్టరేట్ల ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఓర్పు, స‌హ‌నం న‌శించిన కొంద‌రు  రెవెన్యూ అధికారులపై దాడులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ ‘ధరణి పోర్టల్‌’ రద్దు  హామీతో బాధితుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ధరణి రద్దుపై రాహుల్ గాంధీ ఇచ్చిన భరోసా వారిలో కొత్త నమ్మకాలను, ఆశలను కలిగిస్తోంది. ధరణిని రద్దు చేస్తామనే హామీతో.. చిన్న చిన్న సమస్యలతో తమ సొంత భూమికే పరాయి వారిగా మారిన 12 లక్షల మంది బాధితుల కుటుంబాల్లో ఆనందం వెల్లివెరుస్తోంది.-బోరెడ్డి అయోధ్యరెడ్డి,టీపీసీసీ అధికార ప్రతినిధి