రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు డాక్టర్ సైఫ్ కు బెయిల్ మంజూరు చేసింది వరంగల్ జిల్లా కోర్టు. సైఫ్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర. 16 వారాల పాటు ప్రతి శుక్రవారం కేసు విచారణ ఆఫీసర్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కేసులో సాక్షులను ప్రభావితం చేయకూడదని సూచించింది. ప్రీతి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయొద్దని.. ఒక వేళ కండీషన్స్ ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఫిబ్రవరి 22న మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 24న డాక్టర్ సైఫ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. 26న హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది.
ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు చెప్పగా.. ప్రీతి తండ్రి మాత్రం తమ కూతురిది మూమ్మాటికీ హత్యే అని ఆరోపించారు. కావాలనే డయాలసిస్ చేసి టాక్సికాలజీ రిపోర్టును తప్పుదారి పట్టించినట్లు ఆరోపించారు.