వేసవిలో అధికారులకు సెలవులు లేవు

  •     తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలి
  •     ఉమ్మడి వరంగల్ తాగునీటి పర్యవేక్షణ ప్రత్యేకాధికారి డాక్టర్ బి.గోపి 
  •     కలెక్టర్ సిక్తా పట్నాయక్,  జీడబ్ల్యూఎంసీ కమిషనర్​తో సమీక్ష

వరంగల్​సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, వేసవి దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా తాగునీటి సరఫరా ప్రత్యేకాధికారి డాక్టర్ బి.గోపి అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నగరంలో తాగునీటి సరఫరాపై సమీక్షించారు. హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి జీడబ్ల్యూఎంసీ, పబ్లిక్ హెల్త్, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

త్రినగరిలో ప్రతిరోజు ఎంత నీటి సరఫరా చేస్తున్నారు.? తాగునీటి సమస్యలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి.?, నగరంలో ఎన్ని వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారనే వివరాలను ప్రత్యేకాధికారి గోపి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలు తరిగిపోతున్నాయని, ఇలాంటి సమయంలో నీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లకు అవసరమైన తాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి సమస్య రాకుండా చూడాలన్నారు.

ప్రస్తుతం 210 ఎంఎల్డీ నీటి సరఫరా చేస్తున్నారని, దీనికి అదనంగా మరో 40 ఎంఎల్డీ నీరు సరఫరా చేయాలన్నారు. అప్రమత్తంగా ఉండి ఎప్పుడు సమస్య వచ్చినా తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. లీకేజీలు లేకుండా చూసుకోవాలని, ఏదైనా సమస్య వస్తే గంటల వ్యవధిలోనే పరిష్కరించాలన్నారు. నగర పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అదనంగా నీరు అందించాలన్నారు. నీటి సరఫరాకు సంబంధించి రోజువారి నివేదిక కమిషనర్ కు సమర్పించాలన్నారు. సమస్యల పరిష్కారానికి స్వయం సహాయక బృందం సభ్యులు (ఎస్ హెచ్ జీ),  రెసిడెంట్ వెల్ఫేర్ సంఘాల సహకారాన్ని తీసుకోవాలన్నారు.

నీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు..

తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావద్దని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. తాగునీటికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేవిధంగా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులను వార్డుల ప్రత్యేకాధికారులుగా నియమించామని, ప్రతిరోజు డివిజన్​లో క్షేత్రస్థాయిలో పర్యటించి, చివరి ఇంటి వరకు తాగునీరు చేరే విధంగా  పర్యవేక్షించాలన్నారు.

గ్రేటర్ కమిషనర్ మాట్లాడుతూ ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి నాలుగు ఫిల్టర్ బెడ్ల ద్వారా వరంగల్ మహానగరంలోని 66 డివిజన్లకు తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. ఏజెన్సీ ద్వారా ఎప్పటికప్పుడు లీకేజీలు, మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీడబ్ల్యూఎంసీలో ఉన్న 24 వాటర్ ట్యాంకర్లకు తోడుగా వేసవిలో మరో 25 అదనపు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాను చేస్తున్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు పరిష్కరిస్తున్నామన్నారు.

అనంతరం నగర పరిధిలోని కేయూసీ ఫిల్టర్ బెడ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నీటి సరఫరా నిర్వహణ తీరును ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, పబ్లిక్ హెల్త్ ఈఈ రాజ్ కుమార్, ఈఈలు రాజయ్య, బీఎల్ శ్రీనివాస్, శ్రీనివాస్​ రావు, ప్రత్యేకాధికారులు, డీఈలు, ఏఈలు, లైన్ మెన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.