ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు


సిగ్నల్స్ పనిచేయక బైక్ యాక్సిడెంట్
ముగ్గురికి తీవ్ర గాయాలు

హనుమకొండ, వెలుగు: ట్రాఫిక్​ సిగ్నళ్లు పని చేయకపోవడం.. జంక్షన్​ లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం ఘోర ప్రమాదానికి కారణమైంది. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన గుర్రం నరేశ్​ హనుమకొండలో కారు డ్రైవర్​ గా పని చేస్తున్నాడు. నరేశ్ పెద్దనాన్న గుర్రం సాంబయ్య, చిన్నాన్న గుర్రం మొగిళి వాచ్​మెన్ గా పని చేస్తూ అంతా కలిసి ఫాతిమా నగర్ ఎన్ ఐటీ ప్రాంతంలో ఉంటున్నారు. కాగా, స్వగ్రామం రేపాకలో తమ బంధువు ఒకరు చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆదివారం బైక్​ పై బయల్దేరారు. ఈ క్రమంలో కేయూ జంక్షన్​ వద్దకు రాగా అక్కడ ట్రాఫిక్​ సిగ్నల్స్​ పని చేయకపోవడం.. ఆ సమయంలో రోడ్డుపై ఉండి విధులు నిర్వర్తించాల్సిన ట్రాఫిక్​ సిబ్బంది ఎక్కడో మూలకు ఉండి సైన్​ ఇవ్వడంతో జంక్షన్​ క్రాస్​ చేస్తున్న రెండు బైకులు  వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నరేశ్, మొగిళి ఇద్దరి తలకు దెబ్బలు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదానికి కారణమైన మరోబైక్​ అక్కడి నుంచి పరారైంది. కేయూ పోలీసులు.. ఎం.రాజ్​కుమార్​, షబ్బీర్ అక్కడికి చేరుకుని 12.20 గంటల ప్రాంతంలో 108కు సమాచారం అందించగా.. 12.40 వరకూ అంబులెన్స్​ ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం. అనంతరం కేయూ కానిస్టేబుళ్లు ఇద్దరూ క్షతగాత్రులకు కట్లు కట్టి అంబులెన్స్​లో స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

తాడిచెర్ల ఓసీపీలో దారుణం
టిప్పర్ లారీ ఢీకొని కార్మికుడు మృతి
ఆందోళనకు దిగిన కుటుంబసభ్యులు

మల్హర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల జెన్కో ఓపెన్ కాస్ట్ గనిలో దారుణం జరిగింది. మైన్ లోని ఏఎంఆర్ కంపెనీకి చెందిన కార్మికుడు.. టిప్పర్ లారీ ఢీకొని చనిపోయాడు. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. తాడిచెర్లకు చెందిన అర్ని దశరథం(48) అనే వ్యక్తి జెన్కో మైన్ లోని ఏఎంఆర్ కంపెనీలో హెల్పర్ గా పనిచేస్తున్నాడు. రోజూలాగే ఆదివారం తెల్లవారుజామున తన బైక్ పై డ్యూటీకి వెళ్లాడు. ఈక్రమంలో ఎదురుగా అతివేగంతో వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన స్పాట్​లో చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు మైన్ లో ఆందోళనకు దిగారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐ రంజిత్ రావు, కొయ్యూరు ఎస్సై సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు, మృతుడి కుటుంబ సభ్యులకు కొంతసేపు వాగ్వాదం జరిగింది. చివరకు ఆందోళనకారులకు  పోలీసులుసర్ది చెప్పారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మైన్ లో టిప్పర్ లారీలు ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నాయని తోటి కార్మికులు చెబుతున్నారు. అతి వేగాన్ని అరికట్టాలని కోరారు.

మహిళలు ఎదిగేందుకు కృషి చేస్తాం

హసన్ పర్తి, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే  అరూరి రమేశ్​తెలిపారు. ఆదివారం సిటీలోని బీమారంలో మహిళా పొదుపు, పరపతి సంఘం 4వ వార్షిక మహాసభ నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ లోన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీమారంలోని దళితవాడలో రూ.50లక్షలతో మినీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తామన్నారు. అలాగే రూ.15లక్షలతో మహిళా సంఘాల కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు ఫండ్స్ కేటాయిస్తామన్నారు. కార్పొరేటర్ జక్కుల రజిత, ప్రాజెక్టు మేనేజర్ రవీందర్ రావు, మెప్మా సీవో రమేశ్ ఉన్నారు.

80వేల బుక్కులు చదివిన కేసీఆర్ కు చరిత్ర తెల్వదా?

హసన్ పర్తి, వెలుగు: తెలంగాణ విమోచన దినాన్ని సమైక్యతా వారోత్సవాలుగా నిర్వహించడం చరిత్రను వక్రీకరించడమేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్​ రెడ్డి విమర్శించారు. 80వేల బుక్కులు చదివిన కేసీఆర్ .. చరిత్ర తెలియకుండా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ అమరవీరులను అవమానించడమే అవుతుందన్నారు. ఆదివారం హసన్ పర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రజలను ఊచకోత కోయించిన నిజాం పేరు చెప్పే ధైర్యం కూడా కేసీఆర్ కు లేకుండా పోయిందన్నారు. ఎంఐంఎంతో జతకట్టి, మళ్లీ దొరల పాలన తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్, హరి శంకర్, కుమారస్వామి, రామచంద్రారెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.

పెండింగ్ బిల్లులు చెల్లించాలి

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీపీఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్​డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2012–13లో జనగామలో 1167మందికి అప్పటి సర్కారు ఇండ్ల పట్టాలు ఇచ్చిందన్నారు. ఇప్పటి ప్రభుత్వం అందులో 250 ఇండ్ల నిర్మాణం మాత్రమే ప్రారంభించిందని, అవికూడా అసంపూర్తిగానే మిగిలాయన్నారు. వెంటనే నిధులు కేటాయించి, మిగతా ఇండ్లను సైతం పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇందిరమ్మ ఇండ్ల స్థలాల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ఈ నెల 20న పాదయాత్ర చేస్తామన్నారు. ఈకార్యక్రమానికి లబ్ధిదారులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు.

రెండు దశాబ్దాలకు ఒక్కటైన్రు

జనగామ పట్టణంలోని ప్రిస్టన్ స్కూల్ స్టూడెంట్లు రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్నారు. 1998–-99 బ్యాచ్ కు చెందిన టెన్త్ క్లాస్ స్టూడెంట్లు ఆదివారం పట్టణంలోని కెమిస్ట్రీ భవన్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పాఠాలు బోధించిన ఆనాటి టీచర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ ఉప్పలంచి నరేందర్, కౌన్సిలర్లు స్వరూప, సమద్, పూర్వ విద్యార్థులు నోముల శ్రీశైలం, మిద్దెపాక స్టాలిన్, మాదాసు శ్రీకాంత్, మచ్చ సందీప్, ఎస్. నరేందర్, చీకట్ల శ్రీధర్, డి.నవీన్​కుమార్, కడింగుల బాలరాజు తదితరులున్నారు.

రావణాసుర వధ కొత్త కమిటీ ఎన్నిక


ములుగు, వెలుగు: ములుగు జిల్లాకేంద్రంలో దసరా సందర్భంగా ఏటా రావణాసురవధను ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంకు సంబంధించిన కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గండ్రకోట కుమార్ తో పాటు ముగ్గురిని ప్రధాన కార్యదర్శులుగా, 12మందిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 17ఏండ్లుగా రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు, వ్యాపారులు, ఆధ్యాత్మిక వేత్తలు సహకరించాలని కోరారు.

సిగ్నల్స్ పనిచేయక బైక్ యాక్సిడెంట్
ముగ్గురికి తీవ్ర గాయాలు

హనుమకొండ, వెలుగు: ట్రాఫిక్​ సిగ్నళ్లు పని చేయకపోవడం.. జంక్షన్​ లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం ఘోర ప్రమాదానికి కారణమైంది. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన గుర్రం నరేశ్​ హనుమకొండలో కారు డ్రైవర్​ గా పని చేస్తున్నాడు. నరేశ్ పెద్దనాన్న గుర్రం సాంబయ్య, చిన్నాన్న గుర్రం మొగిళి వాచ్​మెన్ గా పని చేస్తూ అంతా కలిసి ఫాతిమా నగర్ ఎన్ ఐటీ ప్రాంతంలో ఉంటున్నారు. కాగా, స్వగ్రామం రేపాకలో తమ బంధువు ఒకరు చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆదివారం బైక్​ పై బయల్దేరారు. ఈ క్రమంలో కేయూ జంక్షన్​ వద్దకు రాగా అక్కడ ట్రాఫిక్​ సిగ్నల్స్​ పని చేయకపోవడం.. ఆ సమయంలో రోడ్డుపై ఉండి విధులు నిర్వర్తించాల్సిన ట్రాఫిక్​ సిబ్బంది ఎక్కడో మూలకు ఉండి సైన్​ ఇవ్వడంతో జంక్షన్​ క్రాస్​ చేస్తున్న రెండు బైకులు  వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నరేశ్, మొగిళి ఇద్దరి తలకు దెబ్బలు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదానికి కారణమైన మరోబైక్​ అక్కడి నుంచి పరారైంది. కేయూ పోలీసులు.. ఎం.రాజ్​కుమార్​, షబ్బీర్ అక్కడికి చేరుకుని 12.20 గంటల ప్రాంతంలో 108కు సమాచారం అందించగా.. 12.40 వరకూ అంబులెన్స్​ ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం. అనంతరం కేయూ కానిస్టేబుళ్లు ఇద్దరూ క్షతగాత్రులకు కట్లు కట్టి అంబులెన్స్​లో స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

భారీగా గంజాయి పట్టివేత!


వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో భారీగా గంజాయి పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆదివారం వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వీరంతా ఆంధ్రా నుంచి తెలంగాణకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 100 కేజీల గంజాయి దొరికినట్లు సమాచారం.

వెదురు వస్తువులు ఉపయోగించాలి

కాశీబుగ్గ, వెలుగు: వెదురు వస్తువులు ఉపయోగించడం వల్ల ప్లాస్టిక్ వాడకం తగ్గుతుందని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఆదివారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని, సిటీలోని పోచమ్మ మైదాన్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వెదురు బుట్టలు, తట్టలు, ఇతరత్రా వస్తువులు వాడడం అలవాటు చేసుకోవాలన్నారు. ఒకప్పుడు పెద్దలు వీటినే ఉపయోగించేవారని గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు చెన్నబోయిన అప్పన్న వర్ధంతి సందర్భంగా సీపీఐ లీడర్లతో కలిసి ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.

ఈతకు వెళ్లి స్టూడెంట్ మృతి

నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: ఈతకు వెళ్లి స్టూడెంట్ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో జరిగింది. ఎస్సై జగదీశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మార్తం ప్రచండ(16) శనివారం ఫ్రెండ్స్ తో కలిసి స్థానిక పాలేరు వాగులో ఈతకు వెళ్లాడు. వాగులో వరద ఉధృతి ఎక్కువ ఉండడంతో.. అందులో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు పేరెంట్స్ కు చెప్పడంతో గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాగు వద్దకు చేరి గాలింపు చర్యలు చేపట్టి, ఆదివారం డెడ్ బాడీని వెలికితీశారు.